Farmers Protest NSA : సరిహద్దుల్లో అందోళనలు చేస్తున్న రైతు నేతలపై చర్యలు తీసుకునేందుకు జాతీయ భద్రత చట్టాన్ని(NSA) తీసుకొచ్చిన హరియాణా ప్రభుత్వం కొద్ది గంటల వ్యవధిలోనే దాన్ని ఉపసంహరించుకున్నట్లు ప్రకటించింది. అయితే ఈ చట్టాన్ని పంజాబ్ - హరియాణా సరిహద్దుల్లో ఆందోళనలు చేపట్టిన రైతులపై చర్యలు తీసుకనేందుకు గురువారమే ప్రవేశపెట్టింది. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించిన అందోళనకారుల ఆస్తులను జప్తు చేస్తామని తెలిపింది.
ఫిబ్రవరి 13న దిల్లీ చలో మార్చ్ ప్రారంభమైనప్పటి నుంచి పోలీసులు, రైతల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి. కొంతమంది రైతుల ముసుగులో వచ్చి అల్లర్లు సృష్టిస్తున్నారని పోలీసులు ఆరోపిస్తున్నారు. ఈ ఉద్యమంలో పలువురు రైతు నాయకులు శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని అన్నారు. ఫేస్బుక్, వాట్సాప్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యకలాపాలు, ప్రసంగాలు చేస్తున్నారని తెలిపారు. అందుకే ఈ జాతీయ భద్రత చట్టం కింద చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఇలా ప్రకటించిన మరుసటి రోజే ఆ చట్టాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం పేర్కొంది. 'రైతు సంఘ నాయకులపై తీసుకొచ్చిన జాతీయ భద్రతా చట్టాన్ని అమలు చేసే విషయాన్ని తిరిగి పరిశీలించాం. అందుకే అమలు చేయరాదని నిర్ణయించుకున్నాం. శాంతి భద్రతల పరిరక్షణలో అధికారులకు రైతులు సహకరించాలి' అంబాలా ఐజీపీ శిబాష్ కబిరాజ్ తెలిపారు.
'వారి ఆస్తులను జప్తు చేస్తాం'
ఈ ఆందోళనకారుల వల్ల ప్రైవేటు, ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగిందని పోలీసులు తెలిపారు. ఈ నష్టాన్ని అంచనా వేస్తున్నామని అన్నారు. అలాగే ఆ ఆందోళనకారుల ఆస్తులను, బ్యాంకు ఖాతాలను జప్తు చేసుకుని, పరిహారాన్ని చెల్లిస్తామని ఇప్పటికే ప్రజలకు తెలియజేసినట్లు పేర్కొన్నారు. ఈ అందోళనల్లో ఎవరికైనా ప్రాణ, ఆస్తి నష్టం జరిగే ఆ వివరాలను ప్రభుత్వానికి తెలియజేయాలని పోలీసులు పిలుపునిచ్చారు.
శుభకరణ్ సింగ్ కుటుంబానికి పరిహారం
దిల్లీ చలో సందర్భంగా జరిగిన ఘర్షణల్లో మరణించిన యువ రైతు శుభకరణ్ సింగ్ కుటుంబానికి పంజాబ్ ప్రభుత్వం పరిహారాన్ని ప్రకటించింది. కోటి రూపాయల నగదుతో పాటు శుభకరణ్ సోదరికి ప్రభుత్వ ఉద్యోగాన్ని ఇవ్వనున్నట్లు పంజాబ్ సీఎం భగవంత్‌మాన్ సింగ్ వెల్లడించారు. శుభకరణ్ మృతికి కారణమైన పోలీసుపై చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు. రైతు శుభకరణ్ పబ్లిసిటీ కోసం ఆందోళనల్లో పాల్గొనేందుకు రాలేదని, వ్యవసాయ ఉత్పత్తులకు కనీస మద్దతు ధర డిమాండ్ చేసేందుకు వచ్చినట్లు సీఎం భగవంత్‌మాన్ వెల్లడించారు. రైతులకు పంజాబ్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయన అన్నారు.
శుభకరణ్ మృతిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసేందుకు పంజాప్ ప్రభుత్వం ఎందుకు ఆలస్యం చేస్తోందని రైతు సంఘం నేతలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటివరకు ఇంటర్నెట్ సేవలను ఎందుకు పునరుద్ధరించలేదని నిలదీశారు.
కేంద్రంతో చర్చలకు రైతులు 'నో'- శుక్రవారం 'బ్లాక్ డే'గా పాటించాలని దేశ ప్రజలకు విజ్ఞప్తి
'రైతుల కోసం అన్ని విధాలా కృషి చేస్తున్నాం'- అన్నదాతల నిరసన వేళ మోదీ కీలక వ్యాఖ్యలు