PM Modi Attacks Congress : కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు హనుమాన్ చాలీసా వినడం కూడా నేరంగానే ఉండేదన్నారు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ. ప్రజల ఆస్తులను లాక్కుని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచేందుకు ప్రయత్నిస్తోందన్న వాస్తవాన్ని బయటపెడితే, కాంగ్రెస్ ఎందుకు ఉలిక్కిపడుతోందని మోదీ నిలదీశారు. దమ్ముంటే వాస్తవాన్ని అంగీకరించి పోరాడాలని సూచించారు. రాజస్థాన్ టోంక్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్నారు. ప్రధానంగా కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుని మండిపడిన మోదీ, ప్రతిపక్ష ఇండియా కూటమిపై తీవ్ర విమర్శలు చేశారు.
"మొన్న నేను రాజస్థాన్ వచ్చినప్పుడు ఓ నిజాన్ని దేశం ముందు ఉంచాను. కాంగ్రెస్ మీ ఆస్తులను లాక్కుని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్ర పన్నుతుందనే సత్యాన్ని బయటపెట్టాను. కాంగ్రెస్ ఓటు బ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల పరదాను తీసి చూపాను. దీనిపై వారికి (కాంగ్రెస్) ఎంత మండుతుందంటే వాళ్లు అన్ని విధాలా మోదీని తిట్టడం మొదలు పెట్టారు. నేను కాంగ్రెస్ నుంచి ఒకటి తెలుసుకోవాలనుకుంటున్నాను. కాంగ్రెస్ నిజాన్ని చూసి ఎందుకు భయపడుతోంది. మీ రహస్య అజెండా బయటపెట్టగానే భయం పట్టుకుందా? మీకు ధైర్యం ఉంటే అంగీకరించండి. మిమ్మల్ని ఎదుర్కోడానికి మేం సిద్ధంగా ఉన్నాము."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
ఇదే సమయంలో కాంగ్రెస్ బడుగు, బలహీనవర్గాలకు చెందినవారి రిజర్వేషన్లు లాక్కుని కొందరు ప్రత్యేక వ్యక్తులకు పంచాలనే కుట్ర పన్నుతోందని మోదీ విమర్శించారు. 2004 ఏడాది కేంద్ర ప్రభుత్వ పగ్గాలు చేపట్టిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ల నుంచి ముస్లింలకు ప్రత్యేక కోటా కల్పించే ప్రయత్నం చేసిందని ప్రధాని గుర్తుచేశారు. ఇది రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధమని అభిప్రాయపడ్డారు.
"రాజ్యాంగాన్ని రూపొందించినప్పుడు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కులాలకు రక్షణ కల్పించేందుకు మతం ఆధారంగా రిజర్వేషన్లను వ్యతిరేకించారు. కానీ దేశ వనరులపై మొట్టమొదటి హక్కు ముస్లింలకే ఉంటుందని మన్మోహన్ సింగ్ ప్రకటించారు. అది ఆయన అభిప్రాయం మాత్రమే కాదు. 2004లో కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తగ్గించి ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించేందుకు ప్రయత్నించారు. ఇది ఒక పైలట్ ప్రాజెక్ట్ మాత్రమే. తర్వాత దేశం మొత్తం అమలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. 2004- 2010 మధ్య ఆంధ్రప్రదేశ్‌లో ముస్లిం రిజర్వేషన్‌లను అమలు చేయడానికి కాంగ్రెస్ నాలుగుసార్లు ప్రయత్నించింది. అయితే సుప్రీంకోర్టు అవగాహన కారణంగా కాంగ్రెస్ ఆ ప్రణాళికలను అమలు చేయలేకపోయింది. 2011లో దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు కాంగ్రెస్ యత్నించింది. ఇదంతా రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధం. కర్ణాటకలో బీజేపీ సర్కారుకు అవకాశం వచ్చినప్పుడు వాళ్లు ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల నుంచి లాగేసుకుని ముస్లింలకు ఏవైతే రిజర్వేషన్లు ఇచ్చారో దాన్ని మేం రద్దు చేశాం."
--నరేంద్ర మోదీ, ప్రధాన మంత్రి
కేవలం ఓటుబ్యాంకు, బుజ్జగింపు రాజకీయాల కోసం ఇతరుల నుంచి లాక్కుని ఓ వర్గానికి పంచాలని చూస్తున్న కాంగ్రెస్‌కు తగిన బుద్ధి చెప్పాలని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు.
ప్రజా పథకాలను బీజేపీ రద్దు చేస్తోంది : జైరాం రమేశ్
మరోవైపు, బీజేపీపై, మోదీపై ఎదురుదాడి చేసింది కాంగ్రెస్. రాజస్థాన్‌లోని పేద ప్రజలకు వివిధ పథకాల రూపంలో గతంలో తమ ప్రభుత్వం రక్షణ కల్పించిందని, దాన్ని బీజేపీ ఎందుకు వెనక్కి తీసుకుంటోందని కాంగ్రెస్ మంగళవారం ప్రశ్నించింది. 'ఈఆర్సీపీలో బీజేపీ ఎంత అవినీతికి పాల్పడింది? ఇసార్దా డ్యాన్ నిర్వాసితులకు పరిహారాన్ని ఎంతకాలం బీజేపీ నిరాకరిస్తుంది?' అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ నిలదీశారు.