ED Summons To Delhi CM : దిల్లీ మద్యం పాలసీకి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. ఈనెల 21న సెంట్రల్ దిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయంలో విచారణకు రావాలని పేర్కొంది. కాగా, ఇలా కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడం ఇది వరుసగా తొమ్మిదోసారి.
మనీలాండరింగ్ నిరోధక చట్టం- పీఎంఎల్ఏ కింద కేజ్రీవాల్ వాంగ్మూలాన్ని నమోదు చేసేందుకు వీలుగా మరోసారి సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే ఈడీ జారీ చేస్తున్న సమన్లు చట్టవిరుద్ధమని పేర్కొంటూ కేజ్రీవాల్ విచారణకు గైర్హాజరవుతూ వస్తున్నారు. గతంలో ఈడీ జారీ చేసిన సమన్లకు ఆయన నుంచి స్పందన లేకపోవడం వల్ల దిల్లీ కోర్టులో ఈడీ రెండు ఫిర్యాదులు నమోదు చేసింది. దీనిపై శనివారం విచారణ సందర్భంగా కేజ్రీవాల్ కోర్టు ముందు హాజరయ్యారు. విచారణ జరిపిన చీఫ్ మెట్రోపాలిటన్ న్యామేజిస్ట్రేట్ ఆయనకు బెయిల్ మంజూరు చేశారు. అయితే మరుసటి రోజే తాజాగా మరోసారి ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది.
రెండో మనీలాండరింగ్ కేసులో నోటీసులు
మరోవైపు దిల్లీ జల్ బోర్డు (డీజేబీ)తో సంబంధం ఉన్న మరో మనీలాండరింగ్ కేసులో కూడా కేజ్రీవాల్‌కు విడిగా మరోసారి నోటీసులు పంపింది ఈడీ. ఈ కేసుకు సంబంధించిన విచారణను మార్చి 18న ఎదుర్కోవాలంటూ సమన్లు జారీ చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. అయితే సార్వత్రిక ఎన్నికలకు ముందు దిల్లీ సీఎంను జైలుపాలు చేయాలని బీజేపీ చూస్తోందని దిల్లీ ఆర్థిక మంత్రి అతిశీ ఆరోపించారు.
కవితతో కలిసి కేజ్రీవాల్ విచారణ?
ఈ వ్యవహారంలో ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ శుక్రవారం సాయంత్రం అరెస్టు చేసింది. ప్రత్యేక విమానంలో ఆమెను హైదరాబాద్ నుంచి దిల్లీలోని ఈడీ కేంద్ర కార్యాలయానికి తీసుకెళ్లారు. అక్కడి స్పెషల్ సెల్లో కవితను ఉంచారు. శనివారం ఉదయం వైద్య పరీక్షల అనంతరం ఆమెను దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టులో హారజరుపరిచారు ఈడీ అధికారులు. ఇరు వర్గాల వాదోపవాదనల తర్వాత కోర్టు కవితకు ఈనెల 23 వరకు ఏడు రోజుల కస్టడీ విధించింది. అయితే మార్చి 21న కేజ్రీవాల్ విచారణకు హాజరైతే కవితతో కలిపి ఆయన్ను విచారించాలని ఈడీ అధికారులు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సీబీఐ కూడా విచారించింది
మరోవైపు మద్యం కుంభకోణం (2021-22) కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో ఆయనను 9 గంటల పాటు ప్రశ్నించారు అధికారులు. ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు. ఇదిలాఉంటే కేజ్రీవాల్‌ను త్వరలోనే సీబీఐ అరెస్టు చేయనుందని ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఇటీవల ప్రకటనలు చేస్తున్నారు.
బీజేపీ ఆకాశంలోకి- కాంగ్రెస్ పాతాళంలోకి! 40 ఏళ్లలో ఎంతో మార్పు
మగ బిడ్డకు జన్మనిచ్చిన సిద్ధూ మూసేవాలా తల్లి- 58ఏళ్ల వయసులో డెలివరీ