EC Seized Money Lok Sabha Polls : సార్వత్రిక ఎన్నికల వేళ దేశంలో నగదు, మద్యం ఏరులైపారుతోంది. ఎన్నికల సంఘం ఎక్కడికక్కడ పటిష్ఠ నిఘా ఏర్పాటు చేసి భారీగా నగదు జప్తు చేస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి రోజుకు రూ.100 కోట్ల విలువైన నగదు, ఇతర వస్తువులను జప్తు చేస్తున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. 75 ఏళ్ల సార్వత్రిక ఎన్నికల చరిత్రలో జప్తులు ఈసారే రికార్డుస్థాయిలో నగదు జప్తు జరిగిందని ఈసీ పేర్కొంది.
దేశవ్యాప్తంగా పోలింగ్ మొదలుకాకుండానే ఇప్పటివరకు రూ. 4,650 కోట్లను జప్తు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. 2019 సార్వత్రిక ఎన్నికల సమయంలో జప్తు చేసిన దానికంటే ఇది ఎక్కువ కావడం గమనార్హం. ఏడు విడతల్లో పోలింగ్ ముగిసే సమయానికి ఈ జప్తులు ఏ స్థాయికు చేరుతాయో అంచనాలకు అందని విధంగా ఉన్నాయని ఈసీ తెలిపింది. 75 ఏళ్ల లోక్‌సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జప్తులను ఎన్నికల సంఘం గతంలో ఎప్పుడూ చేయలేదు. ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వందల సంఖ్యలో కేసులు నమోదు
పోలింగ్ తేదీలు సమీపించే కొద్దీ ఈ నగదు ప్రవాహం మరింత ఎక్కువ కానుంది. దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1వ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్‌లు, స్టాటిక్ సర్వైలెన్స్ బృందాలు, పోలీసులు ఎన్నికల్లో నగదు ప్రవాహంపై దృష్టిపెట్టారు. ఏ స్థాయి నేతలైనా అధికారులు వారి కాన్వాయ్‌లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఓటర్లకు పంచేందుకు సిద్ధంగా ఉంచిన కానుకలను దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు పలు చోట్ల స్వాధీనం చేసుకున్నాయి. ఈ జప్తులకు సంబంధించి ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.
ముర్షిదాబాద్ డీఐజీ తొలగింపు
మరోవైపు బంగాల్లోని ముర్షిదాబాద్ డీఐజీని తొలగించాలని భారత ఎన్నికల సంఘం ఆదేశించింది. హింసాత్మక ఘటనలు జరిగినప్పుడు తక్షణమే నిరోధించడానికి చర్యలు తీసుకోలేదని, పర్యవేక్షణ లోపం కారణంగా ఈ ఆదేశాలు జారీ చేసింది. రెండు హింస్మాతక ఘటనలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు ఉపయోగించనుట్లు తెలసిందని ఈసీ పేర్కొంది.