How To Remove Kids Scribbles From Walls : చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో గోడలపై మరకలు పడే సమస్య ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే.. చిన్నారులు ఇంటి గోడల్నే కాన్వాస్‌గా మార్చుకుంటారు. క్రేయాన్స్, పెన్సిల్ వంటి వాటితో గీతలు గీయడం, బొమ్మలేయడం చేస్తుంటారు. దాంతో ఇలాంటి మరకలు(Stains) తొలగించడానికి తల్లులు తలలు పట్టుకుంటుంటారు. మీ పిల్లలు ఇలానే గోడలపై గీతలు గీస్తున్నారా? అవి తొలగిస్తే ఎంతకీ పోవట్లేదా? అయితే, మీకోసం అద్దిరిపోయే టిప్స్ తీసుకొచ్చాం. వాటితో ఎలాంటి ఇబ్బంది లేకుండా సులభంగా మరకల్ని తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు. అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
టూత్‌పేస్ట్ : ఇది గోడలపై మరకలను తొలగించడంలో చాలా బాగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా టూత్ పేస్ట్‌ను తీసుకొని గోడలపై గీసిన క్రేయాన్ గీతలు, రంగులు, ఆహార పదార్థాల మరకలపై కాస్తంత అప్లై చేయండి. అలా కాసేపు ఉంచి ఆపై తడి వస్త్రంతో తుడిస్తే మరకలు ఇట్టే తొలగిపోతాయని చెబుతున్నారు.
హెయిర్ డ్రయర్ : ఇంట్లోని గోడలపై పడిన క్రెయాన్స్ గీతలను హెయిర్ డ్రయర్‌ను వాడి ఈజీగా పోగొట్టుకోవచ్చంటున్నారు నిపుణులు. ఇందుకోసం హెయిర్ డ్రయర్‌ని ఆన్ చేసి ఆ వేడి గాలిని కాసేపు ఆ మరకలపై తాకేలా చేస్తే చాలు. ఆపై సోప్ వాటర్‌లో ముంచిన క్లాత్‌తో తుడిచేస్తే గోడలు డ్యామేజ్ కాకుండానే క్రేయాన్ మరకల్ని సులభంగా తొలగించుకోవచ్చంటున్నారు.
వంటసోడా : ఇది కూడా గోడలపై గీసిన క్రేయాన్ గీతలు తొలగించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందట. ఇందుకోసం ఒక గిన్నెలో చెంచా వంట సోడా తీసుకొని అందులో కాసిన్ని వాటర్ పోసి మిశ్రమంలా ప్రిపేర్ చేసుకోవాలి. ఆపై దాన్ని గోడపై గీతలు ఉన్న చోట రాసి పాత టూత్ బ్రష్‌తో రుద్ది, తడి గుడ్డతో తుడిస్తే చాలు. గీతలు ఈజీగా రిమూవ్ అవుతాయంటున్నారు నిపుణులు.
ఇంటి గోడలపై క్రెయాన్స్, పెన్సిల్ గీతలు మాత్రమే కాదు.. అప్పుడప్పుడు నూనె మరకలు పడుతుంటాయి. వీటిని తొలగించడానికి చాలా కష్టపడుతుంటారు మహిళలు. అయితే వాటిని కూడా ఇలా ఈజీగా తొలగించుకోవచ్చంటున్నారు నిపుణులు.
వెనిగర్ : వంటల్లో వాడే వెనిగర్ కూడా గోడలపై నూనె మరకలను తొలగించడానికి ఉపయోగపడుతుంది. వెనిగర్, నీళ్లు సమాన పరిమాణంలో తీసుకోవాలి. ఒక స్పాంజ్ తీసుకుని మరకలున్న చోట ఆ మిశ్రమాన్ని అప్లై చేయాలి. ఇరవై నిమిషాల తర్వాత మెత్తని వస్త్రంతో తుడిస్తే సరి. మరకలు ఈజీగా తొలగిపోతాయి!
లిక్విడ్ డిష్‌వాషర్ : ఇది కూడా గోడలపై నూనె మరకలను తొలగించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక స్ప్రే బాటిల్లో కాసింత లిక్విడ్ డిష్‌వాషర్ పోసుకొని గోడలపై మరకలు ఉన్న చోట అప్లై చేసి అలా గంటపాటు వదిలేయాలి. ఆపై వేడినీటితో కడిగి మెత్తని క్లాత్‌తో శుభ్రం చేసుకుంటే సరిపోతుందని చెబుతున్నారు.
ఇవీ చదవండి :
ఫర్నిచర్‌పై మరకలు పోవాలా? ఈ టిప్స్ పాటిస్తూ క్లీన్ చేస్తే సూపర్ షైన్ గ్యారెంటీ!
ఇంట్లో ఫ్లోటింగ్ షెల్ఫులు ఉపయోగిస్తున్నారా? - ఈ టిప్స్ పాటిస్తూ క్లీన్ చేస్తే అందంగా ఉంటాయి!