Renuka Swamy Murder Case Darshan Security : రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారని బెళగావి ఉత్తర జైలు విభాగం డీజీపీ శేష తెలిపారు. ఆయనకు ఇతర అనారోగ్య సమస్యలు ఏమి లేవని అన్నారు. వైద్యులు అందజేసిన పత్రాలు పరిశీలించి తగిన జాగ్రత్తలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలతో డీజీపీ శేష శనివారం బళ్లారి కేంద్ర కారాగాన్ని పరిశీలించారు.
అనంతరం జైలు ముందున్న విలేకరులతో మాట్లాడుతూ దర్శన్ వెన్నునొప్పితో బాధపడుతున్నారని అన్నారు. '10×6 విస్తీర్ణంలోని బ్యారక్స్‌లోని దేశీయ మరుగుదొడ్డిలో కూర్చోడానికి దర్శన్ ఇబ్బందులు పడుతున్నారు. రెండు రోజులుగా ఆహారం తక్కువగా తీసుకుంటున్నారు. ఆయనకు వెన్నునొప్పి ఉన్నట్లు వైద్యులు అందజేసిన పత్రాలను పరిశీలించి సర్జరీ కుర్చీ ఇవ్వడంపై ఆలోచన చేస్తాం. దర్శన్‌ను ఉంచిన హై సెక్యూరిటీ సెల్‌లో 15 బ్యారక్‌లు ఉన్నాయి. వాటిలో నలుగురు ఖైదీలు ఉన్నారు. అయితే దర్శన్‌ను ప్రత్యేక బ్యారక్‌లో ఉంచామని, 24 గంటల పాటు భద్రత ఉంటుంది. భద్రత సిబ్బందికి రెండు బాడీ కెమెరాలతో పాటు మూడు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ప్లేట్, గ్లాస్, మగ్గు, కింద వేసుకోవడానికి దప్పటి మాత్రమే ఇచ్చాం. సామాన్య ఖైదీలకు ఇచ్చే ఆహారమే దర్శన్‌కు పెడుతున్నాం' అని డీజీపీ శేష స్పష్టం చేశారు.
రాజకీయ ఒత్తిడి లేదు
బళ్లారి కేంద్ర కారాగారంలో ఉన్న దర్శన్‌కు సౌకర్యాలు కల్పించాలని తమపై ఎలాంటి రాజకీయ ఒత్తిడి లేదని డీజీపీ శేష తెలిపారు. ఒకవేళ అలాంటి ఒత్తిడి వచ్చినా భయపడి వసతులు కల్పించమన్నారు. సామాన్య ఖైదీలకు ఏవిధమైన వసతులుంటాయో అవే వర్తిస్తాయన్నారు. దీనిపై ఎలాంటి అనుమానం లేదని, అందరికీ చట్టం ఒక్కటే ఉంటుంది అని తెలిపారు. టీవీ కావాలని కోరితే ఏర్పాటు చేస్తామన్నారు. దర్శన్‌ను కలిసేందుకు వచ్చిన అభిమానులు, ఇతరులను లోపలికి పంపడం లేదన్నారు. తొలుత రక్త సంబంధీకులకు అవకాశం కల్పిస్తామని, వారితో పాటు న్యాయవాదిని తీసుకుని వెళ్లడానికి అనుమతి ఉంటుందన్నారు.
జైలులో మార్పులొచ్చాయి
జైలు శాఖకు నిధులు తక్కువగా విడుదల చేస్తున్నారని, సిబ్బంది, అధికారుల కొరత తీవ్రంగా ఉందని డీజీపీ శేష పేర్కొన్నారు. గతంలో జైల్లో ఖైదీలకు స్వేచ్ఛ ఉండేదని, ఇప్పుడు దానికి తావు లేదన్నారు. బళ్లారి కేంద్ర కారాగారంలో గంజాయి, ఇతర వస్తువులు లభించిన ఖైదీలపై 22 కేసులు నమోదు చేశామన్నారు. తాను గతంలో ఈ కేంద్ర కారాగారంలో పని చేసినట్లు గుర్తుచేశారు. ప్రస్తుతం మార్పులు వచ్చాయన్నారు. జైలుపై తప్పుడు ప్రచారం చేయడం తగదన్నారు. ఎవరికైనా ఎలాంటి అనుమానాలున్నా జైలు ముఖ్య అధికారిని కలిసి వివరణ తీసుకోవచ్చని స్పష్టం చేశారు. బళ్లారి జైలును గూగుల్ మ్యాప్ ద్వారా టీవీలో చూపించడం సరికాదన్నారు. ఈ విధంగా చూపించడంతో జైల్లో భద్రత కల్పించడం కష్టమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. నిత్యం సీసీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలను భద్రపరిచాలని అధికారులకు సూచించారు. దర్శన్ బళ్లారి జైలుకొచ్చి రెండు రోజులు గడిచిందన్నారు. ఉదయం 15, సాయంత్రం 15 నిమిషాలు గది బయటకు వచ్చి వాకింగ్ చేసుకోవడానికి అవకాశం ఉన్నా, దర్శన్ బయటకు రాలేదని వివరించారు.
రాచమర్యాదల ఎఫెక్ట్- బళ్లారి జైలుకు కన్నడ నటుడు దర్శన్ షిఫ్ట్! - Actor Darshan case
జైలులో నటుడు దర్శన్‌కు రాచమర్యాదలు- ఏడుగురు అధికారులు సస్పెండ్ - Special Treatment to Actor Darshan