Cylinder Blast In Uttar Pradesh : ఓ ఇంట్లో షార్ట్ సర్క్యూట్ జరిగి రెండు సిలిండర్లు పేలిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనం అయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు అగ్ని మాపక వాహనాలతో మంటలను అదుపులోకి తెచ్చారు. ఉత్తర్‌ప్రదేశ్‌లో లఖ్‌నవూ జిల్లాలో జరిగిందీ దుర్ఘటన.
ఇదీ జరిగింది
కకోరి పోలీస్ స్టేషన్ పరిధిలో ముషీర్ అలియాస్ పుట్టు అనే వ్యక్తి తన కుటుంబంతో నివాసం ఉంటున్నారు. ముషీర్ దంపతుల వివాహ వార్షికోత్సవం సందర్భంగా బంధువులంతా కలిశారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి 10.30 సమయంలో అతని ఇంట్లోని రెండో అంతస్తులో షార్ట్ సర్క్యూట్ జరిగింది. దీంతో ఆ సమీపంలో ఉన్న రెండు సిలిండర్లు పేలిపోయాయి. ఇంటి పైకప్పు కాలిపోవడం వల్ల ఇంట్లో ఉన్న ముషీర్, హుస్న్ బానో, ఉమ, హీనా, రాయలు సజీవదహనమయ్యారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో ముషీర్ కుమార్తె ఇషా(17), బంధువులు లకబ్(21), అజ్మద్, ముషీర్ సోదరుడు బబ్లూ కుమార్తె అనమ్(18)లు మంటల్లో తీవ్రంగా గాయాలపాలయ్యారు. ప్రమాదంలో గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. గ్యాస్ సిలిండర్లు పేలుడు ఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
సిలిండర్ పేలి ఒకే కుటుంబంలో ఆరుగురు మృతి
కొన్నాళ్ల క్రితం హరియాణాలో కూడా ఇలాంటి ఘటనే జరిగింది. సిలిండర్ పేలి ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు మరణించారు. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నారు. వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలు వ్యాపించడం వల్ల పక్క ఇళ్లు కూడా దగ్దమయ్యాయి. ఈ ఘటన పానీపత్ జిల్లాలో జరిగింది. మృతులను అబ్దుల్ కరీమ్(50), అఫ్రోజా(46), ఇష్రత్ ఖటుమ్(17), రేష్మా(16), అబ్దుల్ షకూర్(10), అఫాన్(7)గా పోలీసులు గుర్తించారు. కాగా, వీరంతా బంగాల్‌కు చెందిన ఉత్తర దినాజ్‌పుర్ వాసులని పోలీసులు తెలిపారు. వంట వండుతున్నప్పుటు గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా గుర్తించారు. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్‌పై క్లిక్ చేయండి.
4 అంతస్తుల భవనంలో మంటలు.. పైనుంచి దూకేసిన జనం.. దిల్లీ అగ్నిప్రమాద దృశ్యాలు చూస్తే!