How To Make Corn Pakodi Recipe : వాతావరణం కూల్‌గా ఉన్నప్పుడు.. చల్లని సాయంత్రాలప్పుడు.. టీ తాగుతూ పక్కన ఏదైనా వేడి వేడి స్నాక్ ఉంటే ఎలా ఉంటుంది? ఈ ఊహ గుర్తుకు వస్తేనే నోరు ఊరిపోతుంది కదా! అందులోనూ గరంగరం పకోడీలు అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే, చాలా మంది ఎక్కువగా ఆనియన్ పకోడీలు(Pakoda) టేస్ట్ చేస్తుంటారు. ఎప్పుడూ అవే తిని బోర్ అనించవచ్చు. కాబట్టి ఈసారి కాస్త స్పెషల్‌గా "కార్న్ పకోడీలు" ట్రై చేయండి. మంచి రుచితో పాటు ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి! పైగా వర్షాకాలం మొక్కజొన్నలు విరివిగా లభిస్తుంటాయి. కాబట్టి, ఇంటి వద్ద సాయంకాలం పూట ఈ పకోడీలను ప్రిపేర్ చేసుకొని ఆస్వాదించండి. ఇంతకీ, కార్న్ పకోడీ తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- 2 కప్పులు - స్వీట్ కార్న్ గింజలు
- 3 టేబుల్‌స్పూన్లు - శనగపిండి
- 3 టేబుల్‌స్పూన్లు - బియ్యప్పిండి
- 2 టీస్పూన్లు - అల్లం వెల్లుల్లి పేస్ట్
- అర టీస్పూన్ చొప్పున - జీలకర్ర, గరంమసాలా
- పావు టీస్పూన్ - పసుపు
- అర టీస్పూన్ - కారం
- రుచికి సరిపడా - ఉప్పు
- వేయించడానికి సరిపడా - నూనె
- 1 - ఉల్లిపాయ
- 2 - పచ్చిమిర్చి
- కొద్దిగా - కరివేపాకు, కొత్తిమీర తరుగు
కార్న్ పకోడీ తయారీ విధానం :
- ముందుగా మొక్కజొన్నలను తీసుకొని రెండు కప్పులు అయ్యేలా వాటిని గింజలను ఒలుచుకోవాలి. ఆపై వాటిని శుభ్రంగా కడిగి చిన్న జల్లిగిన్నెలో వేసుకొని నీరు పోయే వరకు ఉంచాలి.
- ఆ తర్వాత అందులో గుప్పెడు గింజలు తీసి పక్కన పెట్టుకొని మిగత వాటిని మిక్సీ జార్లో వేసుకొని కచ్చాపచ్చాగా బ్లెండ్ చేసుకోవాలి. అదేవిధంగా పకోడీకి కావాల్సిన విధంగా ఉల్లిపాయ, పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని అందులో శనగపిండి, బియ్యప్పిండి, జీలకర్ర, గరంమసాలా, అల్లంవెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు, కారం వేసుకొని కాస్త వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి.
- తర్వాత ముందుగా మిక్సీ పట్టిపెట్టుకున్న కార్న్ మిశ్రమం, ఉల్లిపాయ, పచ్చిమిర్చి తరుగు, పక్కకు తీసి పెట్టుకున్న గుప్పెడు కార్న్ గింజలు, కరివేపాకు, కొత్తిమీర తరుగు ఒక్కొక్కటిగా వేసుకుంటూ పకోడీ పిండిలా ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. అయితే, మిశ్రమం మరీ గట్టిగా, జారుగా ఉండకుండా చూసుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని పకోడీలు వేగడానికి సరిపడా ఆయిల్ వేసుకొని హీట్ చేసుకోవాలి. నూనె వేడెక్కాక పిండిని చేతిలోకి తీసుకొని వేళ్లతో కొద్దికొద్దిగా పకోడీల మాదిరిగా వేసుకోవాలి.
- అనంతరం మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి పకోడీలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాత వాటిని బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే.. ఎంతో టేస్టీగా ఉండే కరకరలాడే కార్న్ పకోడీ రెడీ!
ఇవీ చదవండి :
క్రిస్పీ క్రిస్పీగా కాలీఫ్లవర్ పకోడి - ఇలా చేశారంటే వావ్ అనాల్సిందే!
చల్లని చిరుజల్లుల వేళ - ఇలా "చికెన్ సూప్" చేసుకొని సిప్ చేయండి - జిందగీ ఖుష్ అవ్వాల్సిందే!