Congress Reaction On Electoral Bonds : ఎలక్టోరల్ బాండ్ల పథకాన్ని కొట్టివేస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై విపక్షాలు స్పందించాయి. సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పును స్వాగతిస్తున్నట్లు కాంగ్రెస్ పేర్కొంది. ఈ తీర్పు ఓట్లశక్తిని బలపరుస్తుందని తెలిపింది. ఈ మేరకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు. మోదీ సర్కార్ ప్రవేశపెట్టిన ఎలక్టోరల్ బాండ్ల పథకం పార్లమెంటు ఆమోదించిన రెండు చట్టాలు, భారత రాజ్యాంగాన్ని ఉల్లంఘించడమేనని సుప్రీంకోర్టు పేర్కొందన్నారు. వీవీ ప్యాట్ల అంశంపై రాజకీయ పార్టీలను కలిసేందుకు ఈసీ తిరస్కరిస్తున్న అంశంపై కూడా సుప్రీంకోర్టు దృష్టి సారిస్తుందని భావిస్తున్నట్లు జైరాం రమేష్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఓటింగ్ ప్రక్రియ పారదర్శకంగా ఉంటే ఈసీ ఎందుకు మొండిగా వ్యవహరిస్తోందని ఆయన ప్రశ్నించారు.
కపిల్ సిబల్ రియాక్షన్
ఎలక్టోరల్ బాండ్ల పథకం రద్దుపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ మాట్లాడారు. 'సుప్రీం కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో పార్టీలకు ఎలక్టోరల్ బాండ్లు ఎవరు ఇస్తున్నారనే విషయానని మనం తెలుసుకుంటాం. క్విడ్ ప్రోకో లేకుండా ఎవరూ రాజకీయ పార్టీలకు పది లక్షలకు లేదా 15 లక్షలకు ఎలక్టోరల్ బాండ్లు ఇవ్వరు. దాని మొత్తం కోట్లలో ఉంటుంది. న్యాయస్థానం తీర్పుతో ఇప్పుడు క్విడ్ ప్రోకో గురించి కూడా మనం తెలుసుకోగలుగుతాం. పార్టీలకు ఎవరైనా ఐదు వేల కోట్ల నిధులు బాండ్ల రూపంలో ఇస్తే వారు అత్యంత ధనవంతుడై ఉండాలి. అలాగే అలా ఆఫర్ చేసినందుకు వారు ప్రభుత్వం నుంచి ఏదైనా లబ్ధి పొంది ఉండాలి. అలాగైతేనే ఇలా భారీ స్థాయిలో పార్టీలకు విరాళాలు అందుతాయి. ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీం ఇచ్చిన తీర్పు బీజేపీని ప్రజాక్షేత్రంలో దోషిగా నిలబెడుతుంది. ప్రధాని మోదీ కుంభకోణం ఎక్కడ ఉంది? ఎక్కడ ఉంది? అని ప్రశ్నిస్తుంటారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వం చేసిన పెద్ద స్కామ్ (ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్) మీ కళ్ల ముందే కనిపిస్తుంది' అని ఆయన వ్యాఖ్యానించారు.
సుప్రీం తీర్పుపై మాజీ సీఈసీ
ఎలక్టోరల్ బాండ్లపై సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై స్పందించారు భారత మాజీ ప్రధాన ఎన్నికల కమీషనర్ ఎస్‌వై ఖురేషి. గత 5-7 ఏళ్లలో సుప్రీంకోర్టు నుంచి మనకు లభించిన అత్యంత చరిత్రాత్మక తీర్పుగా దీనిని అభివర్ణించారు. ఇది ప్రజాస్వామ్యానికి ఒక గొప్ప వరమని అన్నారు. 'ఈ విషయంలో గత కొన్నేళ్లుగా మేమంతా ఆందోళన చెందుతున్నాం. ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే ప్రతిఒక్కరూ దీని రద్దు గురించి పోరాడారు. ఇది విషయమై నేను ఎన్నో కథనాలు రాశాను. మీడియాతో మాట్లాడాను. ఇక మేము లేవనెత్తిన ప్రతి సమస్య న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో పరిష్కారం అయ్యింది' అని ఖురేషి అన్నారు.
ఎలక్టోరల్ బాండ్స్ స్కీమ్‌కు సంబంధించి సుప్రీం ఇచ్చిన తీర్పుపై శివసేన(యూబీటీ) పార్టీ నాయకుడు ఆనంద్ దుబే కూడా మాట్లాడారు. దీనిని ఓ సంచలనమైన తీర్పుగా అభివర్ణించిన ఆయన ఈ పథకం కింద పార్టీలకు, ప్రభుత్వానికి ఎక్కడి నుంచి నిధులు వచ్చేవో తెలియకుండా పోయేదన్నారు. ఇక న్యాయస్థానం ఇచ్చిన తాజా తీర్పుతో ఆ విషయాలను ఇప్పటినుంచి ఎన్నికల కమిషన్ బయటపెట్టాలన్నారు.
'ఎలక్టోరల్ బాండ్స్ రాజ్యాంగ విరుద్ధం'- సుప్రీంకోర్టు సంచలన తీర్పు
రైలు రోకోకు రైతులు పిలుపు- 4 గంటలపాటు ట్రైన్లు బంద్, చర్చలు ఫలించేనా?