Haryana JK Elections Results Reactions : హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రజాస్వామ్య వ్యవస్థ సమగ్రతపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయని కాంగ్రెస్ ఆరోపించింది. ఈ ఎన్నికల్లో బీజేపీ కుట్రపూరితంగా గెలిచిందని విమర్శించింది. హరియాణాలో బీజేపీది అవకతవకల విజయంగా అభివర్ణించింది. ఈ మేరకు హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.
'వాటిని ఈసీ దృష్టికి తీసుకెళ్తాం'
ప్రజల అభీష్టాన్ని తారుమారు చేసి కాషాయం పార్టీ హరియాణా ఎన్నికల్లో గెలిచిందని కాంగ్రెస్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. ఇది పారదర్శక, ప్రజాస్వామ్య ప్రక్రియల ఓటమి అని తెలిపారు. హరియాణాలో కౌంటింగ్ ప్రక్రియ, ఈవీఎంలకు సంబంధించి హస్తం పార్టీ అభ్యర్థులు లేవనెత్తిన అంశాలను ఎలక్షన్ కమిషన్ దృష్టికి తీసుకెళ్తామని స్పష్టం చేశారు.
#WATCH | Delhi: Congress MP Jairam Ramesh says, " ...congress has been made to lose in haryana, congress has not lost." pic.twitter.com/swt0DiZcZW
— ANI (@ANI) October 8, 2024
"హరియాణా ఎన్నికల ఫలితాలు పూర్తిగా ఊహించనవి, ఆశ్చర్యకరమైనవి. ఈ పరిస్థితులలో ఫలితాలను అంగీకరించడం మాకు సాధ్యం కాదు. మా అభ్యర్థులు లేవనెత్తిన సమస్యలను ఈసీ దృష్టికి తీసుకెళ్తాం. హరియాణాలో కాంగ్రెస్ నుంచి విజయాన్ని లాగేసుకున్నారు. మార్పు కోరుకున్న ప్రజల మనోభావాలకు వ్యతిరేకంగా ఫలితాలు వచ్చాయి. జమ్ముకశ్మీర్‌లో కూడా మెజారిటీని కూటగట్టడానికి బీజేపీ కుటిల ప్రయత్నాలు చేస్తుంది. జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను తొలగించినవారిని ప్రజలు తగిన సమాధానం చెప్పారు. ఎన్సీ-కాంగ్రెస్ ప్రభుత్వం జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరణకు అన్ని విధాలా కృషి చేస్తుంది."
-- జైరాం రమేశ్, కాంగ్రెస్ అగ్రనేత
'మా పార్టీని నాశనం చేసేందుకు ప్రయత్నించారు'
గత ఐదేళ్లలో నేషనల్ కాన్ఫరెన్స్‌ను నాశనం చేసేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయని ఆ పార్టీ ఉపాధ్యక్షుడు ఒమర్ అబ్దుల్లా ఆరోపించారు. అందుకోసం కొత్త పార్టీలను కూడా సృష్టించారని విమర్శించారు. కానీ దేవుని దయ తమపై ఉందని తెలిపారు. అందుకు తమ నాశనాన్ని కోరుకున్నవారినే ఈ ఎన్నికల్లో దేవుడు నాశనం చేశాడని ఎద్దేవా చేశారు.
"మరోసారి జమ్ముకశ్మీర్ ప్రజలకు సేవ చేసేందుకు నాకు ఓటు వేసిన బుడ్గామ్ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ తీర్పు పార్టీ బాధ్యతలను మరింత పెంచింది. అభివృద్ధి పనుల ద్వారా ప్రజల అంచనాలను అందుకోవడమే మా కర్తవ్యం. రాబోయే ఐదేళ్లలో అందుకు కృషి చేస్తా." అని ఒమర్ వ్యాఖ్యానించారు.
'ఈ తీర్పు కేంద్రానికి గుణపాఠం'
జమ్ముకశ్మీర్ ప్రజల తీర్పు నుంచి కేంద్ర ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలని పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ హితవు పలికారు. త్వరలో కొలువుదీరబోయే ఎన్సీ- కాంగ్రెస్ ప్రభుత్వ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవద్దని కేంద్రాన్ని కోరారు. తమ పార్టీ నిర్మాణాత్మక ప్రతిపక్ష పాత్ర పోషిస్తుందని చెప్పారు. హంగ్ రాకుండా స్థిరమైన ప్రభుత్వం కోసం ఓటు వేసిన కశ్మీర్ ప్రజలను ఆమె అభినందించారు.
#WATCH | Srinagar, J&K: NC winning candidate from Ganderbal and Budgam assembly seats, Omar Abdullah says, " in the end, the people are masters... people decide if they like us or not. two months ago, i lost the elections, and now i won. i am the same person, belong to the same… pic.twitter.com/9SRkJIAk7Q
— ANI (@ANI) October 8, 2024
'ఇది అభివృద్ది, సుపరపాలనల విజయం'
మరోవైపు, హరియాణా, జమ్ముకశ్మీర్ ఎన్నికల ఫలితాలపై బీజేపీ స్పందించింది. శాసనసభ ఎన్నికల్లో బీజేపీకి మరోసారి స్పష్టమైన మెజారిటీ ఇచ్చినందుకు హరియాణా ప్రజలకు ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. "ఇది అభివృద్ధి, సుపరిపాలన రాజకీయాల విజయం. హరియాణా ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేందుకు కృషి చేస్తామని హామీ ఇస్తున్నా. ఈ గొప్ప విజయం కోసం అవిశ్రాంతంగా, పూర్తి అంకితభావంతో పనిచేసిన బీజేపీ నాయకులకు అభినందనలు" అని మోదీ ఎక్స్‌లో పోస్ట్ చేశారు.
I am proud of the BJP’s performance in Jammu and Kashmir. I thank all those who have voted for our Party and placed their trust in us. I assure the people that we will keep working for the welfare of Jammu and Kashmir. I also appreciate the industrious efforts of our Karyakartas.…
— Narendra Modi (@narendramodi) October 8, 2024
"జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో బీజేపీ ప్రదర్శన పట్ల నేను గర్విస్తున్నాను. బీజేపీకి ఓటేసినవారందరికీ ధన్యవాదాలు. జమ్ముకశ్మీర్ సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తాం. ఎన్నికల్లో విజయం కోసం కృషి చేసిన కార్యకర్తలకు అభినందనలు. జమ్ముకశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు. జమ్ముకశ్మీర్‌లో ఈ ఎన్నికలు చాలా ప్రత్యేకం. ఆర్టికల్ 370, 35(A) రద్దు తర్వాత మొదటిసారిగా జేకేలో ఎన్నికలు జరిగాయి. ఓటింగ్ పెరిగింది" అని ప్రధాని మోదీ తెలిపారు.
'కాంగ్రెస్‌ను ప్రజలు మరోసారి తిరస్కరించారు'
లోక్ సభ పోరులో మాదిరిగానే, శాసనసభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌ను ప్రజలు తిరస్కరించారని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. హస్తం పార్టీ తప్పుడు వాగ్దాలను ప్రజల నమ్మలేదని ఎద్దేవా చేశారు. ఓటు బ్యాంకు కోసం విదేశాలకు వెళ్లి దేశాన్ని అవమానించే వారికి రైతులు, సైనికుల గుణపాఠం చెప్పారని వ్యాఖ్యానించారు. హరియాణాలో వరుసగా మూడోసారి బీజేపీకి అధికారం ఇచ్చిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. హరియాణాలో బీజేపీ సాధించిన ఈ భారీ విజయం, మోదీ ప్రభుత్వంపై రైతులు, పేదలు, వెనుకబడిన తరగతులు, సైనికులు, యువత విశ్వాసానికి నిదర్శనమని కొనియాడారు. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేశారు.
अपने वोट बैंक के लिए विदेश में जाकर देश का अपमान करने वालों को किसानों और जवानों की भूमि हरियाणा ने सबक सिखाया है।
— Amit Shah (@AmitShah) October 8, 2024
लगातार तीसरी बार भाजपा को प्रदेश की सेवा करने का अवसर देने के लिए हरियाणा की जनता का हृदय से आभार व्यक्त करता हूँ। मोदी जी के नेतृत्व में भाजपा की केंद्र और प्रदेश…
మోదీ నాయకత్వంలోని బీజేపీ జమ్ముకశ్మీర్ అభివృద్ధి, భద్రతకు కట్టుబడి ఉందని అమిత్ షా తెలిపారు. జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద రహితంగా మార్చడం, దేశంలోని ఇతర ప్రాంతాల మాదిరిగా అభివృద్ధి చేయడానికి బీజేపీ అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. " జమ్ముకశ్మీర్‌లో ప్రశాంతంగా ఎన్నికలు ప్రశాంతంగా ఎన్నికలు జరుగుతాయని ప్రధాని మోదీ గతంలో వాగ్దానం చేశారు. ఈ క్రమంలో శాంతియుతంగా ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికలను విజయవంతంగా నిర్వహించిన ఈసీ, భద్రతా బలగాలు, జేకే అధికారులు, పౌరులకు అభినందనలు. కాంగ్రెస్ హయాంలో జమ్ముకశ్మీర్‌లో ఉగ్రపాలన సాగేది. బీజేపీ హయాంలో ప్రజాస్వామ్య్ పండుగను ఘనంగా చేసుకున్నాం. ఈ ఎన్నికల్లో బీజేపీకి ఓట్లు, సీట్లు పెరిగాయి." అని షా పేర్కొన్నారు.
ఆప్ బోణీ- అభ్యర్థికి కేజ్రీ అభినందనలు
జమ్ముకశ్మీర్‌లోని దోడా నియోజకవర్గంలో ఆప్ తరఫున గెలిచిన అభ్యర్థి మెహ్రాజ్ మాలిక్‌ను దిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అభినందించారు. అలాగే వీడియో కాల్ లో శుభాకాంక్షలు తెలిపారు. అలాగే దిల్లీ, పంజాబ్ సీఎం కూడా మెహ్రాజ్ మాలిక్‌కు అభినందనలు తెలియజేశారు.