Congress 2024 General Elections : ఎట్టకేలకు ఎన్నికల నగారా మోగింది. దీంతో రాజకీయ పార్టీలన్నీ హై అలర్ట్ అయ్యాయి. ఈదఫా జరగబోయే సార్వత్రిక ఎన్నికలు ఏ పార్టీకి ఎలా ఉన్నప్పటికీ, జాతీయ రాజకీయ పక్షం కాంగ్రెస్‌కు మాత్రం చావోరేవో తేల్చుకునేంత పెద్ద సవాల్ లాంటివి!! కాంగ్రెస్ ఓ వైపు ఒంటరి పోరాటం చేస్తూనే, మరోవైపు 'ఇండియా' కూటమిలోని పార్టీలతో టీమ్ వర్క్ కూడా చేయాల్సిన తరుణమిది. ప్రధాని మోదీ చరిష్మా, హిందీ బెల్ట్‌లో బీజేపీ హవాతో బలంగా ఉన్న ఎన్డీయే కూటమిని ఢీకొనేలా ఇండియా కూటమికి దిశానిర్దేశం చేసే కీలక బాధ్యత కాంగ్రెస్‌పైనే ఉంది. ఎందుకంటే ఇండియా కూటమి సారథిగా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వ్యవహరిస్తున్నారు. ఓ వైపు కాంగ్రెస్ కోసం జాతీయ స్థాయి వ్యూహ రచన చేస్తూనే, మరోవైపు ఇండియా కూటమిని సమన్వయం చేయడం ఖర్గేకు పెద్ద ఛాలెంజ్‌గా మారనుంది. మొత్తం మీద ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలాలేంటి? బలహీనతలు ఏంటి?
413 సీట్లు ఉత్తరాదిలోనే
జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ప్రస్తుత స్థితిని చూస్తే, అది ఉత్తరాది కంటే దక్షిణాదిలోనే చాలా బలంగా ఉంది. దేశంలో మొత్తం 543 లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిలో 130 దక్షిణాది రాష్ట్రాల్లో ఉన్నాయి. అంటే మిగతా 413 సీట్లు ఉత్తరాదిలోనే ఉన్నాయి. ఈ ఒక్క పాయింటే ఇప్పుడు కాంగ్రెస్‌ను ఒత్తిడిలోకి నెడుతోంది. 413 స్థానాల్లో కనీసం 300 తమకే వస్తాయనే ధీమాతో బీజేపీ ఉంది. హిందీ బెల్ట్‌లోని రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. కాంగ్రెస్ పార్టీ రిజల్ట్ కార్డ్ మాత్రం చాలా డల్‌గా కనిపించింది. అంటే గత ఐదేళ్లలో హిందీ బెల్ట్‌లో పూర్వ వైభవాన్ని సాధించే దిశగా హస్తం పార్టీ ఆశించినంత పురోగతిని సాధించలేకపోయిందన్న మాట. చివరకు రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో తమ ప్రభుత్వాలను నిలబెట్టు కోవడంలోనూ విఫలమైంది.
ఉత్తరం, దక్షిణం- ఒకే ఫార్ములా పనిచేస్తుందా ?
ఈసారి ఉత్తరాదిలో అయోధ్య రామమందిర అంశం అత్యంత ప్రధానంగా ప్రభావం చూపించబోతోంది. "డబుల్ ఇంజన్ సర్కారు" వంటి జనాకర్షక పదాలతో బీజేపీ అవలీలగా ఉత్తరాదిలో అత్యుత్తమ ఫలితాలను సాధిస్తోంది. కాంగ్రెస్ మాత్రం ఉచిత హామీలనే నమ్ముకొని చతికిలపడుతోంది. దక్షిణాదిలో మాత్రమే ఉచిత హామీలు వర్క్ ఔట్ కావడం వల్ల హస్తం పార్టీ కర్ణాటక, తెలంగాణలో విజయం సాధించగలిగింది. ఉత్తరాదికి, దక్షిణాదికి వేర్వేరు రకాల వ్యూహాలతో ముందుకు సాగితేనే కాంగ్రెస్‌కు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ్ యాత్ర ఎఫెక్ట్ ఈసారి ఉత్తరాదిలో కనిపిస్తుందని కాంగ్రెస్ అధినాయకత్వం నమ్ముతోంది. అయితే ప్రచార ఘట్టంలో భాగంగా ప్రజలతో కనెక్టివిటీని పెంచుకోవడానికి అంతకుమించి ఏం చేయాలి? ఇండియా కూటమిలోని మిత్రపక్షాలతో సమన్వయం ఎలా సాధించాలి ? అనే అంశాలు కీలకంగా మారుతాయని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
దేశంలోనే అతిపెద్ద రాష్ట్రంలో
దేశంలోనే అత్యధికంగా 80 లోక్‌సభ స్థానాలు ఉత్తరప్రదేశ్‌లో ఉన్నాయి. అక్కడ సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్ పొత్తు కుదుర్చుకుంది. ఆ రాష్ట్రంలోని 17 స్థానాల్లో హస్తం పార్టీ బరిలోకి దిగనుంది. ఈ లిస్టులో కాంగ్రెస్ కంచుకోటలు రాయ్ బరేలీ, అమేఠీ కూడా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ, కాంగ్రెస్ మధ్య పొత్తు కుదరడంలో ప్రియాంకా గాంధీ, సోనియాగాంధీలు కీలక పాత్ర పోషించారు. ఈసారి ప్రియాంకా గాంధీ రాయ్ బరేలీ నుంచి పోటీ చేయనున్నారు. యూపీలో యోగిఆదిత్యనాథ్ సారథ్యంలోని బీజేపీని ఢీకొనడం సమాజ్‌వాదీ- కాంగ్రెస్ కూటమికి పెద్ద సవాలే. రామమందిర అంశం సహా ఈ రాష్ట్రంలో బీజేపీకి కలిసొచ్చే అవకాశాలు ముమ్మరంగా ఉన్నాయి. గాంధీ ఫ్యామిలీ చుట్టుపుచూపుగా యూపీకి వచ్చి వెళ్తారనే టాక్ మైనస్ పాయింట్‌గా మారనుంది. యూపీలో కాంగ్రెస్ పార్టీకి జనాకర్షక నాయకత్వం లేకపోవడం మరో పెద్ద నెగెటివ్ అంశం.
దక్షిణంలో గేమ్ ఛేంజర్ కర్ణాటక
రాహుల్ గాంధీ ఈసారి కేరళలోని వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. దక్షిణాదిలో హస్తం పార్టీకి అనుకూలంగా ఉన్న వాతావరణాన్ని మరింత బూస్ట్ చేసేందుకే ఈసారి కూడా వయనాడ్ నుంచే పోటీ చేయాలని రాహుల్ నిర్ణయించుకున్నారట. వ్యూహాత్మకంగా ఇది మంచి నిర్ణయమే. కానీ కర్ణాటకలో బీజేపీని తక్కువ అంచనా వేయడానికి లేదు. ఎందుకంటే 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగిన చాలా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అంతంత మాత్రంగానే ఫలితాలను సాధించింది. కానీ కొన్ని నెలల గ్యాప్ తర్వాత జరిగిన లోక్‌సభ పోల్స్‌లో మాత్రం కమలదళం బంపర్ రిజల్ట్‌ను మూటకట్టుకుంది. ఈసారి దేవెగౌడకు చెందిన జేడీఎస్ పార్టీతో కలిసి కన్నడగడ్డలోని 28 లోక్‌సభ స్థానాల్లో కనీసం 25 సాధించాలనే పట్టుదలతో బీజేపీ ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించకుండా బీజేపీని కర్ణాటకలోని కాంగ్రెస్ సర్కారు అడ్డుకోగలదా? అనేదే ఇప్పుడున్న పెద్ద ప్రశ్న. దేవెగౌడ పార్టీతో పొత్తు ద్వారా కర్ణాటకలోని లింగాయత్ కమ్యూనిటీ బీజేపీకి చేరువయ్యే అవకాశాలు ఉన్నాయని అంచనా వేస్తున్నారు.
తెలంగాణలో ఉచితహామీలపైనే ఆశలన్నీ
ఎన్నికల వేళ మహిళలకు అయిదు గ్యారంటీలను కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. పేద కుటుంబాల్లోని మహిళలకు ఏటా రూ.లక్ష నగదు బదిలీ చేస్తామని వెల్లడించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో కొత్తగా చేపట్టే నియామకాల్లో నారీమణులకు 50 శాతం కోటా ఇవ్వనున్నట్లు తెలిపింది. తెలంగాణలోనూ మహిళలకు ప్రతినెలా రూ.2,500 నగదు బదిలీ చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. ఇప్పటిదాకా ఆ పాతిక వేలే ఇవ్వడం మొదలుపెట్టలేదు. ఇక ఏడాదికి రూ.లక్ష ఇస్తామంటే నమ్మడం ఎలా అని తెలంగాణలోని మహిళా ఓటర్ల నుంచి కాంగ్రెస్ పార్టీకి ప్రశ్న ఎదురవుతోంది. ఇలాంటి అంశాలు కొంత నెగెటివ్‌గా మారే ఛాన్స్ ఉంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో డబుల్ బెడ్ రూం ఇళ్ల అంశం బీఆర్ఎస్ పార్టీని చిత్తుచిత్తుగా ఓడించింది. ఎందుకంటే ఆ స్కీంకు ఎంపికైన వారి కంటే, ఎంపిక కాని వారే ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లంతా కలిసి ఓట్ల రూపంలో వ్యక్తం చేసిన ఆగ్రహమే బీఆర్ఎస్కు ఓటమిని ఖరారు చేసింది. అందుకే సంక్షేమ పథకాల హామీలను ఇచ్చే సందర్భంలో సాధ్యాసాధ్యాలపై రాజకీయ పార్టీలు ఒకటికి రెండుసార్లు పునస్సమీక్ష చేసుకోవాలి. మరోవైపు బీజేపీ కూడా కాదు కాదు అంటూనే రాజస్థాన్, మధ్యప్రదేశ్ సహా చాలా రాష్ట్రాల్లో ఉచిత హామీలను అమలు చేస్తోంది. ప్రజల అభిప్రాయాన్ని మల్చడంలో ఉచిత హామీలు ముఖ్యమైనవే కానీ, అవే మొత్తం ఫలితాలను నిర్దేశించవు.
ప్రధాని అభ్యర్థి లేకుండానే
ప్రధానమంత్రి అభ్యర్థి కూడా ఎన్నికల్లో చాలా ముఖ్యం. ఇండియా కూటమికి ఇప్పటిదాకా ప్రధాని అభ్యర్థి ఎవరూ లేరు. దీనిపై కూటమి పక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరలేదు. ఇండియా కూటమిలోని చాలా పార్టీలు చెట్టుకొకటి పుట్టకొకటిగా ఎగిరిపోయాయి. మమతా బెనర్జీకి చెందిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ హ్యాండ్ ఇవ్వడం వల్ల, వామపక్షాలతో కలిసి బెంగాల్‌లో కాంగ్రెస్ పోటీ చేయనుంది. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తు కుదిరింది. పంజాబ్‌లో మాత్రం సోలోగానే ఇండియా కూటమి పార్టీలు పోటీ చేయబోతున్నాయి. మహారాష్ట్రలో ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలతో కాంగ్రెస్ చెయ్యి కలిపింది. ఇప్పటికే రెండుగా చీలిపోయిన ఆ పార్టీలతో హస్తం పార్టీ జతకట్టి ఎంతమేరకు ఫలితాలను సాధించగలదు అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ రాష్ట్రంలోనే మెజారిటీ లోక్‌సభ స్థానాలు ఉద్ధవ్ శివసేన, శరద్ పవార్ ఎన్సీపీలకే కాంగ్రెస్ ఇచ్చేసింది. ఉత్తరప్రదేశ్‌లోనూ అలాగే చేసింది. ఈ పొత్తుల లెక్కలన్నీ చూస్తే, బీజేపీని ఒంటరిగా ఢీకొనలేకే పొత్తులకు కాంగ్రెస్ ప్రాధాన్యత ఇస్తోందా అనే ప్రశ్న ఉదయిస్తోంది. మొత్తం మీద కాంగ్రెస్ వ్యూహాలు మంచివా ? కావా? అనేది ఎన్నికల ఫలితాల్లోనే తేలుతుంది.
సార్వత్రిక ఎన్నికల బడ్జెట్ ఎంతో తెలుసా? ఎలక్షన్లకు అయ్యే ఖర్చు తెలిస్తే షాక్!
ఎన్నికల కోడ్ కథ తెలుసా? ఎప్పుడు ప్రవేశపెట్టారు? అమల్లోకి వచ్చాక ఏం జరుగుతుంది?