CM Security Breach In Karnataka : కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వద్దకు ఓ కాంగ్రెస్ కార్యకర్త ఏకంగా తుపాకీతో వచ్చాడు. నడుము భాగంలో దానిని పెట్టుకొని వెళ్లి సీఎంకు పూలమాల వేశాడు. ఈ ఘటనా దృశ్యాలు అక్కడే ఉన్న మీడియా కెమెరాలకు చిక్కాయి. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. వీటిని చూసిన ప్రతిపక్షాలు ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని సిద్ధరామయ్య ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
నడుముకు గన్‌తో ప్రచార వాహనంపైకి!
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిద్ధరామయ్య సోమవారం బెంగుళూరులో పర్యటించారు. అక్కడి లోక్‌సభ నియోజకవర్గాల అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా విల్సన్ గార్డెన్ సమీపంలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ఆయన, వాహనంపై నిలబడి ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదులుతున్నారు. ఈ క్రమంలో ఉన్నట్టుండి సిద్ధాపుర్‌కు చెందిన రియాజ్ అహ్మద్ అనే ఓ కాంగ్రెస్ కార్యకర్త పూలదండ తీసుకొని సీఎం ఉన్న ప్రచార వాహనంపైకి ఎక్కాడు.
అయితే సిద్ధరామయ్యకు పూలమాల వేసే సమయంలో అతడి నడుము భాగాన ఓ గన్ కనిపించింది. ఇది గమనించిన భద్రతా సిబ్బంది వెంటనే అలర్ట్ అయ్యారు. వెంటనే రియాజ్‌ను అక్కడి నుంచి పక్కకు తీసుకెళ్లి అక్కడే ఉన్న పోలీసులకు అప్పగించారు. నగర పోలీస్ కమిషనర్ బీ.దయానంద ఆదేశాల మేరకు పశ్చిమ డివిజన్ అదనపు పోలీసు కమిషనర్ సతీష్‌కుమార్, సౌత్ డివిజన్ డీసీపీ లోకేష్ భరమప్ప జగల్‌సర్ అతడిని విచారించారు.
'అది లైసెన్స్ ఉన్న గన్నే'
'రియాజ్ అహ్మద్ వద్ద లైసెన్స్డ్ గన్ ఉంది. లోక్‌సభ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చిన తర్వాత లైసెన్స్ పొందిన ఆయుధాలను స్థానిక పోలీస్ స్టేషన్‌లో డిపాజిట్ చేయాలి. కానీ, రియాజ్ తన దగ్గరున్న తుపాకీని పోలీసులకు అప్పజెప్పలేదు. అయితే 2019లో రియాజ్ అహ్మద్‌పై దాడి జరిగింది. దీంతో అతడిపై మళ్లీ దాడి జరిగే అవకాశం ఉంది. ఈ తరుణంలో అతడు ప్రత్యేక అనుమతి తీసుకొని పిస్టోల్‌ను తన వద్దే పెట్టుకుని తిరుగుతున్నాడు. ప్రస్తుతం అతడు మా అదుపులోనే ఉన్నాడు' అని డీసీపీ లోకేష్ భరమప్ప జగల్‌సర్ తెలిపారు.
బాలీవుడ్ టు కోలీవుడ్- లోక్‌సభ బరిలో ఎందరో సినీ తారలు- ఎవరెవరెంటే? - Actors In Lok Sabha Polls 2024
2024లో తొలి సంపూర్ణ సూర్యగ్రహణం- HD ఫొటోలు చూశారా? మళ్లీ 20 ఏళ్ల తర్వాతే ఇలా! - SOLAR ECLIPSE 2024