Tomato Ketchup Uses : ఇంట్లో ఏ స్నాక్ ఐటమ్ చేసినా పిల్లలు టొమాటో కెచప్‌తో తినడానికి ఎంతో ఇష్టపడతారు. అలాగే నూడుల్స్, పాస్తా రెసిపీల రుచి పెంచడానికి కూడా టొమాటో కెచప్‌ని ఉపయోగిస్తుంటాం. కానీ, ఈ కెచప్‌తో కొన్ని వస్తువులను కూడా క్లీన్ చేసుకోవచ్చని మీకు తెలుసా? అవునండీ.. టొమాటో కెచప్‌తో కొన్ని వస్తువులను క్లీన్ చేస్తే కొత్త వాటిలా తళతళా మెరిసిపోతాయి. ఇంతకీ ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు చూద్దాం.
వెండి ఆభరణాలు కొత్తవాటిలా :
వెండి ఆభరణాలు, వస్తువులు కొన్ని రోజుల తర్వాత రంగు మారడం మనం చూస్తుంటాం. అయితే, టొమాటో కెచప్‌ని ఉపయోగించి.. వీటిని కొత్తవాటిలా చేయొచ్చు. ముందుగా ఒక గిన్నెలో టొమాటో కెచప్‌ను పోసి దానిలో వెండి వస్తువుని 5-10 నిమిషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత సాఫ్ట్ బ్రిజిల్స్ ఉన్న టూత్‌బ్రష్‌తో రుద్ది.. పొడి వస్త్రంతో తుడిచి.. గోరువెచ్చటి వాటర్‌తో కడిగేస్తే సరిపోతుంది.
మాడిపోయిన గిన్నెను ఇలా క్లీన్ చేయండి :
కొన్ని సందర్భాల్లో వంట చేసే సమయంలో పాత్రలు మాడిపోతుంటాయి. వీటిని క్లీన్ చేయాలంటే కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. ఈ గిన్నెని టొమాటో కెచప్‌తో క్లీన్ చేయొచ్చు. కొద్దిగా కెచప్‌ను గిన్నెలో వేసి సన్నని మంటపై వేడి చేయాలి. ఇలా చేసేటప్పుడు కెచప్‌లోని నీరు పూర్తిగా ఆవిరి కాకుండా చూసుకోవాలి. కెచప్ చిక్కగా మారిన తర్వాత కొద్దిగా వాటర్ కలపాలి. ఆ తర్వాత గిన్నెను స్టౌ పై నుంచి దింపి రాత్రంతా పక్కన పెట్టి ఉంచాలి. మరుసటి రోజు పాత్రను క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
రాగి వస్తువులు :
ఇంట్లో ఉండే రాగి వస్తువులను మార్కెట్లో దొరికే క్లీనింగ్ ప్రొడక్ట్స్‌తో శుభ్రం చేస్తే.. మెరిసే గుణాన్ని కోల్పోతాయి. అలాగని క్లీన్ చేయకుండా ఉంటే.. రంగు మారిపోయి బ్లాక్‌గా తయారవుతాయి. అందుకే రాగి వస్తువులను తళతళా మెరిపించడానికి టొమాటో కెచప్‌ని ఉపయోగించవచ్చు. ముందుగా రాగి వస్తువులపై కెచప్‌ను పల్చని పొరలా పూయాలి. ఒక ఇరవై నిమిషాల తర్వాత మెత్తని నూలు వస్త్రంతో తుడిచి గోరువెచ్చటి నీటితో కడిగేస్తే సరిపోతుంది. అయినా కూడా ఎక్కడైనా మచ్చలాగా ఉంటే అక్కడ మరోసారి కెచప్ పూసి పావుగంట తర్వాత శుభ్రం చేస్తే సరిపోతుంది.
ఇత్తడి పాత్రలు :
కొన్నిసార్లు వాటర్‌ని స్టోర్ చేసే ఇత్తడి పాత్రల లోపలి భాగంలో పచ్చగా తయారవుతూ ఉంటుంది. ఈ మరకని ఈజీగా టొమాటో కెచప్‌తో క్లీన్ చేయొచ్చు. ముందుగా టొమాటో కెచప్‌ను ఇత్తడి పాత్రకు రాయాలి. కొద్దిసేపటి తర్వాత మెత్తని వస్త్రంతో రుద్దుతున్నట్లుగా తుడవాలి. తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేస్తే సరిపోతుంది.
ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా :
ఇనుప వస్తువులు తుప్పు పట్టకుండా టొమాటో కెచప్ సమర్థంగా పనిచేస్తుంది. ముందుగా వాషింగ్‌సోడాను వాటర్‌లో కలిపి దాన్ని ఇనుప వస్తువుపై స్ప్రే చేయాలి. కొద్దిసేపటికి కెచప్ పూసి కాసేపాగిన తర్వాత రుద్ది కడిగేస్తే సరిపోతుంది. ఇలా చేస్తే ఇంట్లోని గార్డెనింగ్ టూల్స్ తుప్పు పట్టకుండా ఎక్కువ కాలం మన్నుతాయి.
ఇవి కూడా చదవండి :
ఎంత తోమినా గిన్నెల మీద జిడ్డు పోవడం లేదా? - ఇలా చేస్తే చాలు చిటికెలో మాయం!
ఐరన్ దోశ పెనం నల్లగా మారిందా? - ఇలా చేసి అద్భుతాన్ని చూడండి!
ప్లాస్టిక్ బాక్సులు ఉపయోగిస్తున్నారా? - ఈ టిప్స్ పాటించి క్లీన్ చేస్తే బ్యాడ్ స్మెల్ పరార్!