Cheapest Airplane Ticket In India : ప్రయాణించాల్సిన దూరం 186 కిలోమీటర్లు. ఇంత దూరానికి ప్రస్తుతం సాధారణ బస్సు టికెట్ రేటే దాదాపు రూ.300 దాకా ఉంది. అలాంటి ఇంతే దూరానికి విమానంలో ఛార్జీ కేవలం రూ.150 వసూలు చేస్తున్నారు. ఇంతకీ ఎక్కడీ సౌకర్యం ఉంది అనుకుంటున్నారా? ‘ఉడాన్’ పథకంలో భాగంగా మన దేశంలోని అసోంలో ఈ అద్భుతమైన స్కీమ్ అమలవుతోంది.
ప్రాంతీయ విమాన సర్వీసులను ప్రోత్సహించడమే ఉడాన్ పథకం లక్ష్యం. అసోంలోని లీలాబరి, తేజ్‌పూర్ నగరాల మధ్య 186 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రూట్‌లో విమాన సర్వీసులు నడుపుతున్న అలయన్స్ ఎయిర్‌వేస్ కేవలం రూ.150ని విమాన టికెట్ రేటుగా వసూలు చేస్తోంది. దీంతో చాలామంది స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. ఆకాశంలో ఎగరాలనే తమ కోరికను తీర్చుకుంటున్నారు. ఎంతోమంది వ్యాపారులు ఈ అవకాశాన్ని వాడుకొని వ్యాపార లావాదేవీలను వాయువేగంతో చక్కబెట్టుకుంటున్నారు.
రేట్లు చౌక- ఎందుకో తెలుసా?
ట్రావెల్ పోర్టల్ ‘ఇక్సిగో’ ప్రకారం లీలాబరి- తేజ్‌పూర్ లాంటి చౌకైన విమాన రూట్స్ మనదేశంలో దాదాపు 22 ఉన్నాయి. ఈ రూట్లలో టికెట్ కనీస ధర రూ.1000లోపే ఉందట. 2016 అక్టోబర్ 21న కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన ఉడాన్ స్కీం వల్ల ఈ రూట్లలో టికెట్ల రేట్లు తగ్గిపోయాయి. ఉడాన్ స్కీం, రీజనల్ కనెక్టివిటీ స్కీమ్ (ఆర్సీఎస్)లలో చేరే విమానయాన సంస్థలు 50 నిమిషాలలోపు జర్నీ పూర్తి చేయగలిగే రూట్లలో టికెట్ల ధరలను అతిగా వసూలు చేయవు. అందుకే లీలాబరి- తేజ్‌పూర్ రూటులో విమానం టికెట్ రేటు రూ.150కే దొరుకుతోంది. ఆర్సీఎస్ స్కీంలో భాగంగా ఉన్న విమానయాన సంస్థల విమానాలకు వివిధ ప్రోత్సాహకాలు అందుతాయి. వాటికి ల్యాండింగ్ ఛార్జీలు, పార్కింగ్ ఛార్జీలు ఉండవు. ఇవన్నీ ప్రయోజనాలు లభిస్తాయి కాబట్టే కొన్ని ప్రాంతీయ రూట్లలో విమాన టికెట్ల రేట్లు తక్కువగా ఉంటాయి.
ఒక్కో వ్యక్తికి రూ.150 నుంచి రూ. 199 మధ్య విమాన టికెట్ రేటు కలిగిన రూట్లు ఈశాన్య భారతదేశంలో చాలానే ఉన్నాయి. బెంగళూరు-సేలం, కొచ్చిన్-సేలం వంటి దక్షిణాది రూట్లలోనూ ఇదే రేంజులో టికెట్ల ధరలు అమలవుతున్నాయి.
- గౌహతి- షిల్లాంగ్ మార్గంలో విమాన టికెట్ ధర రూ. 400 ఉంది.
- ఇంఫాల్-ఐజ్వాల్, దిమాపూర్-షిల్లాంగ్, షిల్లాంగ్-లిలాబరీ రూట్లలో విమాన టికెట్ రేటు రూ.500 ఉంది.
- బెంగళూరు-సేలం రూట్‌లో టికెట్ ధర రూ.525 మేర ఉంది.
- గౌహతి-పాసిఘాట్ రూట్‌లో విమాన టికెట్ ధర రూ.999 ఉంది.
- లిలాబరి-గౌహతి రూట్‌కు టికెట్ ధర రూ.954 మేర ఉంది.