Kejriwal CBI Case : దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ చివరి ఛార్జిషీట్‌ను సోమవారం దాఖలు చేసింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్‌తో పాటు పలువురి పేర్లను ఈ అభియోగ పత్రంలో ప్రస్తావించింది. ఇంతకుముందు సీబీఐ ఒక ప్రధాన ఛార్జిషీటుతోపాటు నాలుగు అనుబంధ అభియోగ పత్రాలను దాఖలు చేసింది. సోమవారం తాము దాఖలు చేసినదే ఈ కేసులో తుది ఛార్జ్ షీట్ అని సీబీఐ వెల్లడించింది.
గత ఛార్జిషీట్లలో సీఎం కేజ్రీవాల్‌తో పాటు దిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, తెలంగాణ ఎమ్మెల్సీ కె.కవిత; మద్యం వ్యాపారి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డిపై పలు అభియోగాలను సీబీఐ మోపింది. దిల్లీ లిక్కర్ పాలసీలో మార్పులు చేయడం ద్వారా మద్యం వ్యాపారులు, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పెద్దలకు లబ్ధి చేకూరిందని దర్యాప్తు సంస్థ ఆరోపించింది. ఈ కేసులో సీఎం కేజ్రీవాల్ ఆగస్టు 8 వరకు జ్యుడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. దిల్లీ హైకోర్టు సోమవారం ఆయన బెయిల్ పిటిషన్‌ను సమీక్షించనుంది.
గత ఛార్జిషీట్లలో సంచలన అభియోగాలు!
సీబీఐ గతంలో చేసిన అభియోగాల ప్రకారం, ఏపీకి చెందిన మాగుంట శ్రీనివాసుల రెడ్డి 2021 మార్చి 16న దిల్లీ సెక్రటేరియట్‌లో సీఎం కేజ్రీవాల్‌తో భేటీ అయ్యారు. 2021-22 దిల్లీ ఎక్సైజ్ పాలసీలో మార్పులు చేసి మద్యం వ్యాపారంలో తమకు మద్దతు ఇవ్వాలని సీఎంను కోరారు. అందుకు ఓకే చెప్పిన కేజ్రీవాల్ అప్పటికే ఈ విషయంలో తమతో కలిసి పనిచేస్తున్న కల్వకుంట్ల కవితను కలవాలని ఆయనకు సూచించారు. తాము చేస్తున్న సాయానికి ప్రతిగా ఆమ్ ఆద్మీ పార్టీకి నిధులు ఇవ్వాలని కోరారు. కవిత సహా పలువురు మద్యం వ్యాపారులతో కూడిన సౌత్ గ్రూప్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీకి, దిల్లీ ప్రభుత్వంలోని పలువురు పెద్దలకు దాదాపు రూ.90 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు నిధులు అందాయని సీబీఐ ఆరోపించింది.
ఈ క్రమంలో మధ్యవర్తులుగా వ్యవహరించిన విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి, దినేశ్ అరోడాను కేసులో సహ నిందితులుగా సీబీఐ చేర్చింది. ముడుపులను అందుకున్నందుకు ప్రతిఫలంగా కేజ్రీవాల్ సర్కారు దిల్లీ లిక్కర్ పాలసీలో మద్యం వ్యాపారులకు ప్రయోజనకరంగా ఉండేలా పలు మార్పులు చేసింది. వారికి అదనపు క్రెడిట్ నోట్ల జారీ, బ్యాంకు బదిలీల లిమిటేషన్లు కల్పించడం, ఖాతాల్లోని మిగులు బకాయిల నిర్దిష్ట మొత్తం నిర్ణయించడం వంటి అంశాల్లో మినహాయింపులను ఇచ్చింది. ఈ నిర్ణయాల వల్ల దిల్లీ ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లిందని గత ఛార్జిషీట్లలో సీబీఐ పేర్కొంది.