Budget 2024 Expectations : స్వాతంత్య్రం సిద్ధించి వందేళ్లు పూర్తయ్యే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా అవతరించాలని భారత్ ఆకాంక్షిస్తోంది. దానిని సాకారం చేసుకునేందుకు అవసరమైన కార్యాచరణ, ప్రణాళికను కేంద్రప్రభుత్వం ఈ నెల 23న ప్రవేశపెట్టనున్న 2024-25 పూర్తిస్థాయి బడ్జెట్‌లో ఆవిష్కరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. మోదీ 3.0 సర్కారుకు ఇదే తొలి పద్దు కావడం కూడా ఈ బడ్జెట్‌పై అంచనాలు, ఆశలు అధికమవడానికి కారణమవుతోంది. ముచ్చటగా మూడోసారి అధికార పీఠాన్ని దక్కించుకోగలిగినప్పటికీ గతంతో పోలిస్తే లోక్‌సభలో బీజేపీ సంఖ్యాబలం తగ్గింది. ఈ నేపథ్యంలో ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూనే జనాకర్షక నిర్ణయాలను కుడా ప్రభుత్వం ప్రకటించొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
నిర్మలమ్మ ఏడో బడ్జెట్
సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కేంద్రప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరిలో 2024-25కు సంబంధించి మధ్యంతర బడ్జెట్‌నే ప్రవేశపెట్టింది. అందులో స్థిరత్వానికి అధిక ప్రాధాన్యమిచ్చింది. భవిష్యత్ ప్రాధాన్యాలను స్పష్టంచేస్తూ పూర్తిస్థాయి పద్దును మంగళవారం ప్రవేశపెట్టనుంది. కేంద్ర ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ తీసుకురానున్న ఏడో బడ్జెట్ ఇది. కొత్త పద్దులో అభివృద్ధి, సంక్షేమాల మధ్య ప్రభుత్వం సమతూకం పాటించాలని వృద్ధికి ఊతమివ్వడమే కాకుండా ద్రవ్యోల్బణం కట్టడిపై దృష్టిసారించాలని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు.
వికసిత్ భారత్‌పై దృష్టి
ప్రధాని మోదీ పదేపదే ప్రస్తావిస్తున్న వికసిత్ భారత్ 2047 విజన్‌కు అనుగుణంగా మౌలికవసతుల అభివృద్ధి, రక్షణ రంగంలో ఆధునికీకరణ, గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యసేవలు తదితర రంగాలపై కేంద్రం ఈ పద్దులో ప్రధానంగా దృష్టిసారించే అవకాశాలున్నాయి. మధ్యంతర పద్దులో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం సముచిత ప్రాధాన్యమిచ్చింది. మూలధన పెట్టుబడుల కోసం రూ.11.11 లక్షల కోట్లు కేటాయించింది. అంతకుముందు బడ్జెట్‌తో పోలిస్తే అది ఏకంగా 11% అధికం. పూర్తిస్థాయి బడ్జెట్‌లోనూ మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయడం దాదాపు ఖాయమే. ముఖ్యంగా రహదారులు, రైల్వే, గృహనిర్మాణ రంగాలకు కేటాయింపులు పెరగొచ్చు. ప్రధాన పంటలకు కనీస మద్దతు ధరలు పెరగాలని రైతులు ఆశిస్తున్నారు. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కింద అందించే నగదు సాయం పెంపుపైనా అన్నదాతలు ఆశలు పెట్టుకున్నారు. దేశీయంగా ఉత్పత్తి రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు కేంద్రం కీలక నిర్ణయాలు ప్రకటించొచ్చు.
ట్యాక్స్‌పై ఉపశమనం దక్కేనా
గత కొన్నేళ్లలో జీవనవ్యయం గణనీయంగా పెరిగింది. అందుకు తగ్గట్టు వేతనజీవులకు ఆదాయపు పన్ను విషయంలో ఉపశమనాలు మాత్రం దక్కలేదు. ఈసారైనా కాస్త ఊరట దక్కుతుందేమోనని ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్నారు. రూ.10 లక్షల లోపు ఆదాయమున్న మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు కొత్త పద్దులో కొంత ఉపశమనం లభించే అవకాశాలున్నట్లు విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం ఈసారి పన్ను రేట్లను తగ్గిస్తుందని, 5 లక్షల రూపాయల వార్షికాదాయం వరకు పూర్తిగా పన్ను మినహాయింపునిచ్చే అవకాశముందని అంచనాలు వెలువడుతున్నాయి.
మహిళల ఆర్థిక సాధికారత కోసం కొత్త పథకాలు
ప్రజలకు మరింత చేరువయ్యేందుకు మోదీ సర్కారు సామాజిక, సంక్షేమ వ్యయాలను పెంచే అవకాశాలున్నాయి. ముఖ్యంగా గ్రామీణరంగ పథకాలపై వ్యయం పెంచొచ్చు. ఇళ్ల నిర్మాణాలకు చేయూత అందించొచ్చు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణం, ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించొచ్చు. ప్రజారోగ్య బీమా కార్యక్రమాన్ని మరింత విస్తరించేందుకు ఆస్కారముంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ 70 ఏళ్లు దాటిని వృద్ధులు అందరూ ఆయుష్మాన్ భారత్ కిందకు వస్తారని పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి చేసిన ప్రసంగంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రకటించారు. ఆయుష్మాన్ భారత్ కింద బీమా కవరేజిని 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి. దేశ జనాభాలో 30 శాతం మందికి ఆరోగ్య బీమా లేదని ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆయుష్మాన్ భారత్ పథకంలో లబ్ధిదారుల సంఖ్యను కూడా భారీగా పెంచే విధంగా ఈ బడ్జెట్‌లో కేంద్రం కీలక ప్రకటన చేసే అవకాశం ఉంది. మహిళల ఆర్థిక సాధికారత కోసం కొత్త పథకాలను ఈ బడ్జెట్‌లో ప్రకటించొచ్చు.