Bengal Storm Update : బంగాల్ జల్పాయ్గుడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆదివారం ఆకస్మిక తుపాను విధ్వంసం సృష్టించింది. తుపాను కారణంగా జరిగిన ప్రమాదాల్లో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. 100 మందికి పైగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.
మైనాగుడీలోనూ అనేక ప్రాంతాల్లో వడగళ్లతో కూడిన వాన బీభత్సం సృష్టించింది. బలమైన గాలులు వీయడం వల్ల అనేక గుడిసెలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అధిక సంఖ్యలో చెట్లు నేలకూలాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. రాజర్‌హట్, బర్నిష్, బకాలీ, జోర్పక్డి, మధబ్దంగా, సప్తిబరి ప్రాంతాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది.
దీదీ పరామర్శ!
CM Mamata Banerjee Visit On Bengal Storm : ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తుపాను ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో సందర్శించారు. అక్కడ బాధిత కుటుంబాలను పరామర్శించారు. బాధితులకు ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.
"జిల్లా యంత్రాంగం బాధితులకు అండగా ఉంటుంది. తుపాను కారణంగా ఏ మేర నష్టం జరిగిందో అనేదానిపై ఒక అంచనాకు వచ్చాం. జరిగిన అతిపెద్ద నష్టం ఏంటంటే ప్రాణ నష్టం. తుపానులో గాయపడ్డవారిని సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రికి తరలించాం. వారిని మెరుగైన చికిత్స అందుతుంది. రెస్క్యూ ఆపరేషన్లో పాల్గొన్న అధికారులకు నా ధన్యవాదాలు. వైద్యులు, నర్సులు నిర్విరామంగా పనిచేస్తున్నారు. సహాయక చర్యలు ఇప్పటికే ముగిశాయి"
- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
గవర్నర్ రియాక్షన్!
'ఇది చాలా దురదృష్టకర ఘటన. తుపాను పరిస్థితులు చూసి తీవ్రంగా ఆందోళన చెందాను. బాధితులకు అవసరమైన వాటన్నింటినీ అందించమని అధికారులను ఆదేశించాను. అన్ని శాఖలు సమన్వయంగా పనిచేస్తున్నాయి. ఇక పరిస్థితులను ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. నేనూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తాను. ఆ తర్వాత అవసరమైన చర్యలను తీసుకుంటాం' అని బంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ మీడియాతో చెప్పారు.
మోదీ సంతాపం!
మరోవైపు తుపానులో మృతి చెందిన కుటుంబాలకు ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా సంతాపం ప్రకటించారు. సహాయక చర్యల్లో పాల్గొనాలని బంగాల్‌లోని బీజేపీ కార్యకర్తలకు సూచించారు.
కూలిన ఎయిర్పోర్టు పైకప్పు- అంతా సేఫ్!
A Severe Storm In Guwahati Airport : అసోంలోని గువాహాటి నగరంలోనూ ఆదివారం తుపాను బీభత్సం సృష్టించింది. భారీ వర్షాల కారణంగా జనజీవనం స్తంభించింది. లోక్‌ప్రియ గోపీనాథ్ బోర్డోలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ఎయిర్పోర్ట్ పైకప్పు సీలింగ్‌లో కొంత భాగం కూలిపోయింది. ప్రమాద సమయంలో అక్కడే ఉన్న కొందరు ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం విమానాశ్రయంలో నిలిచి ఉన్న నీటిని సిబ్బంది బయటకు ఎత్తిపోస్తున్నారు. ఇక వర్షం కారణంగా అక్కడే ఉన్న కొన్ని యంత్రాలు కూడా పాడయ్యాయి.