Bangladesh MP Murder Case Probe : సంచలనం సృష్టించిన బంగ్లాదేశ్ ఎంపీ అన్వరుల్ అజీమ్ అనర్ (53) హత్య వ్యవహారంలో అధికారులు మమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఈ దర్యాప్తు విజయవంతమవుతుందని బంగ్లాదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్ హరుణ్ ఉర్ రషీద్ ఆశాభావం వ్యక్తం చేశారు. భారత అధికారులతో కలిసి పనిచేయడం పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కేసు గురించి సీఐడీ బంగాల్ సీఐడీ అవిశ్రాంతంగా పనిచేస్తోందని తెలిపారు. ఎంపీ హత్య జరిగిన అపార్ట్మెంట్లోని కమోడ్‌కు అనుసంధానమైన డ్రైనేజీ పైపుని పగులగొట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. అంతేకాకుండా హతిశాల బ్రిడ్జి దగ్గర ఉన్న కెనాల్ వద్ద కూడా సెర్చ్ చేయాలని చెప్పినట్లు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి డిజిటల్ ఎవిడెన్స్‌పై కూడా హరుణ్ మాట్లాడారు. ఈ హత్యకు సంబంధించి ఓ వ్యక్తి అపార్ట్మెంట్లోకి ప్రవేశించాడని, మళ్లీ బయటకు రాలేదని చెప్పారు. నిందితుడు కొన్ని బ్యాగులతో బయటకు వెళ్లిపోయాడని తెలిపారు. అయితే యాదృచ్ఛికంగా, బంగ్లాదేశ్ ఎంపీ హత్యకు సంబంధించి బయటపడిన అపార్ట్మెంట్ CCTV ఫుటేజీలో, ఒక వ్యక్తి ఆకుపచ్చ ట్రాలీ బ్యాగ్‌తో బయటకు వస్తున్నట్లు కనిపించాడని చెప్పారు.
అదొక్కటే చివరి ఆప్షన్"
"శరీర భాగాలు లభించకుంటే, అక్కడున్న రక్తపు నమూనాలకు డీఎన్‌ఏ పరీక్ష నిర్వహిస్తాం. వాటిని ఆయన కుటుంబీకుల డీఎన్‌ఐతో పోల్చి చూస్తాం. అదొక్కటే చివరి ఆప్షన్" అని బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముగ్గురు సభ్యుల దర్యాప్తు బృందం మంగళవారం వెల్లడించింది. వర్షం తగ్గుముఖం పట్టడం వల్ల శరీర భాగాల కోసం ప్రత్యేక బృందాలతో కాలువలో వెతికే ప్రక్రియను మళ్లీ మొదలుపెట్టామని అన్నారు.
అయితే దర్యాప్తు చేస్తున్న అధికారులకు ఆయన శరీర భాగాలను గుర్తించడం కష్టంగా మారింది. ఇప్పటి వరకు ఒక్క శరీర భాగం కూడా దొరకలేదు. చిన్న ముక్కలుగా చేసి పడేయడం, ఇటీవల వర్షాలకు అవి కొట్టుకుపోయి ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎంపీ హత్యను నిర్ధరించుకునేందుకు అపార్టుమెంటులో గుర్తించిన రక్తపు నమూనాల సాయంతో డీఎన్‌ఏ పరీక్షలు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.
ఇదీ కేసు
ఇటీవల కోల్‌కతా శివారులోని న్యూ టౌన్‌లోని ఓ అపార్టుమెంటులో అన్వరుల్ అజీమ్ అనర్ హత్యకు గురయ్యారు. అయితే ఎంపీని ప్రణాళిక ప్రకారం ఓ మహిళ సహాయంతో ఆయనను హనీట్రాప్‌లోకి దింపి, గొంతునులిమి హతమార్చినట్లు అనుమానం వ్యక్తంచేశారు. ఆ తర్వాత మృతదేహంపైన చర్మాన్ని ఒలిచి, ఎవరూ గుర్తుపట్టకుండా ముక్కలు ముక్కలుగా నరికారు. వాటిని కెమికల్స్‌లో కలిపి, ప్లాస్టిక్ సంచుల్లో కుక్కేసి, స్థానికంగా ఉన్న బాగ్జోలా కాలువతోపాటు వివిధ ప్రాంతాల్లో విసిరేసినట్లు తేల్చారు.