AB-PMJAY Ayushman Bharat Card : ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఉచిత ఆరోగ్య బీమా పథకాన్ని 70 ఏళ్లు, ఆ పైబడిన వారందరికీ వర్తింప జేయనున్నట్లు ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా దీనికి సంబంధించి ప్రయోజనాలు కల్పించడంలో భాగంగా అర్హులైన వారి పేర్లను( Ayushman Card Enrollment) నమోదు చేయాలని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు(యూటీలు) కేంద్ర ఆరోగ్య శాఖ లేఖ పంపింది. ఆసక్తి ఉన్న పౌరులందరికీ ఈ ఉచిత ఆరోగ్య బీమా పథకంలో భాగమయ్యేలా అవకాశం కల్పించాలని కోరింది కేంద్ర ఆరోగ్య శాఖ. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ అదనపు కార్యదర్శి ఎల్‌ఎస్ చాంగ్‌సన్ సదరు లేఖ రాశారు.
AB-Pmjay Guidelines : ఈ పథకంలో భాగమవ్వాలనుకునే 70 ఏళ్లు దాటిన పౌరులు ఆయుష్మాన్ మొబైల్ యాప్‌లోగానీ, వెబ్‌సైట్‌లోగానీ (Beneficiary.nha.gov.in) దరఖాస్తు చేసుకోవాలని కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది. ఈ యాప్‌లలో, పోర్టల్‌లో ప్రత్యేక విభాగం కూడా ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఇందులో నమోదు చేసుకున్న అర్హులందరికీ ప్రత్యేకంగా ఆయుష్మాన్ కార్డులు జారీ చేస్తామని తెలిపింది. దరఖాస్తులను ఆన్‌లైన్‌లో మాత్రమే చేయాలని స్పష్టత ఇచ్చింది. ఆధార్‌లో నమోదైన వయసు ఆధారంగా దరఖాస్తు చేసుకోవచ్చని, దరఖాస్తుకు ఆధార్ ఒక్కటే చాలని పేర్కొంది. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, పథకం కూడా త్వరలోనే అమల్లోకి వస్తుందని వెల్లడించింది.
"ఆయుష్మాన్ భారత్‌లో భాగంగా ఉచిత ఆరోగ్య బీమా తీసుకోవాలనుకునే 70 ఏళ్లు దాటిన పౌరులు యాప్‌లోగానీ, పోర్టల్‌లోగానీ దరఖాస్తు చేసుకోవాలి. అర్హులైన వారికి ప్రత్యేక కార్డులు అందజేస్తాం. ఇందులో సామాజిక, ఆర్థిక పరిమితులేమీ ఉండవు" అని కేంద్ర ఆరోగ్య శాఖ లేఖలో రాసుకొచ్చింది.
కాగా, ఇప్పటికే ఏబీ పీఎంజేఏవై కింద ఎన్నో కుటుంబాలు లబ్ధిపొందుతున్నాయి. ఆ కుటుంబాలతో పాటు ఇప్పటివరకు ఈ పథకంలో భాగస్వామ్యం అవ్వనివారికి కూడా ఈ కొత్త పథకం వర్తిస్తుందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. 70 ఏళ్ల వయసు ఉండటమే ఇందుకు అర్హతని క్లారిటీ ఇచ్చింది. ఇతర బీమా పథకాల్లో లబ్ధిదారులుగా కొనసాగుతున్న వారు కూడా దీని ద్వారా ప్రయోజనం పొందవచ్చని తెలిపింది.
గుడ్‌న్యూస్! ఫ్రీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇక డబుల్- వారికి రూ.10లక్షలు! - ABPMJAY Scheme Beneficiaries