Assam Floods 2024 : ఈశాన్య రాష్ట్రం అసోంను గతనెల రోజులుగా వరదలు అతలాకుతలం చేస్తున్నాయి. బ్రహ్మపుత్ర దాని ఉపనదులు ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుండటం వల్ల అసోంను భారీ వరదలు చుట్టుముట్టాయి. అసోంలో ఎక్కడ చూసినా వరద నీరే కనిపిస్తోంది. 30 జిల్లాల్లో దాదాపు 24 లక్షల 50 వేల మందికి పైగా ప్రజలపై వరద ప్రభావం పడింది. వరదల కారణంగా తాజాగా దిస్పూర్‌లో కొండచరియలు విరిగిపడి ఇద్దరు మృతి చెందారు. ఒకరు గాయపడ్డారు. దీంతో ఈ ఏడాది వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల కారణంగా అసోంలో మరణించిన వారి సంఖ్య 64కు పెరిగింది. మరో ముగ్గురు గల్లంతయ్యారు. 3,512 గ్రామాలు ముంపునకు గురయ్యాయి. దాదాపు 63,490 హెక్టార్ల పంట పొలాలు నీట మునిగాయనిఅసోం విపత్తు నిర్వహణ సంస్థ పేర్కొంది.
అసోంలోని ధుబ్రి జిల్లాపై వరద తీవ్ర ప్రభావం చూపాయి. ఆ జిల్లాలో 7 లక్షల 75 వేల మంది ప్రజలు వరద ముంపునకు గురయ్యారు. దర్రాంగ్ జిల్లాలో లక్షా 86 వేల మంది, క్యాచర్ జిల్లాలో లక్షా 75 మంది, మోరిగావ్‌లో లక్ష 46, బార్పేట జిల్లాలో, లక్షా 40 వేల మందిపై వరద ప్రభావం పడింది. బిశ్వనాథ్, దిబ్రూగఢ్, గోలాఘాట్, జొర్హాట్, కర్బి, శివసాగర్, తముల్‌పుర్, లఖింపుర్, సోనిత్‌పుర్, తదితర ప్రాంతాలలో వరదల ప్రభావం ఎక్కువగా ఉంది. రోడ్లు, వంతెనలు, ఇతర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. ఇప్పటివరకు అసోంవ్యాప్తంగా 225 రోడ్లు ధ్వంసమవగా, 10 వంతెనలు కూలాయి. కొన్ని జిల్లాల్లో విద్యుత్ సరాఫరాకు అంతరాయం కలిగి ప్రజలు అంధకారంలో బతుకుతున్నారు.
#WATCH | Assam | Continuous rain in the city causes severe waterlogging issues at several places in Guwahati. pic.twitter.com/C9HZdCmH2P
— ANI (@ANI) July 6, 2024
వరద ప్రభావిత ప్రాంతాల్లో అధికార యంత్రాంగం ముమ్మరంగా సహాయక చర్యలు చేపడుతోంది. 47 వేల 103 మంది వరద బాధితులు 612 పునరావాస కేంద్రాల్లో తలదాచుకుంటున్నారు. వరద బాధితులకు ఆహారం, మందులు సహా ఇతర సహాయక సామాగ్రిని సహాయ బృందాలు అందజేస్తున్నాయి. 15 లక్షల 28 వేలకు పైగా పశుసంపద వరద ప్రభావానికి గురైంది. 84 జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి. కజిరంగా జాతీయ పార్కులో ఇప్పటివరకు 77 వన్యప్రాణులు మృతి చెందగా, 94 వన్యప్రాణులను రెస్య్యూ సిబ్బంది రక్షించింది.
#WATCH | Barpeta, Assam: A large no. of people are affected due to the flood situation in Assam's Barpeta district as several villages and vegetation fields submerged in the rainwater pic.twitter.com/H2jOADmhg2
— ANI (@ANI) July 6, 2024
వరదల పరిస్థితులపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. వరద ప్రభావ జిల్లాల్లో సీఎం సహా రాష్ర్ట మంత్రులు పర్యటించి పరిస్థితిని సమీక్షిస్తున్నారు. ప్రస్తుతం పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, కొన్ని చోట్ల వరదలు తగ్గుముఖం పడుతున్నాయని సీఎం హిమంత చెప్పారు.
అసోంను ముంచెత్తిన వరదలు- 26మంది మృతి- 1.61లక్షల మందికి తీవ్ర ఇబ్బందులు