Arvind Kejriwal Judicial Custody : మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించలేదు. ఏప్రిల్ 23 వరకు జ్యుడీషియల్ కస్టడీని పొడిగిస్తూ దిల్లీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కేజ్రీవాల్ మరికొన్ని రోజులు జైలులోనే ఉండనున్నారు. మరోవైపు కేజ్రీవాల్ అరెస్ట్‌పై వివరణ ఇవ్వలంటూ ఈడీకి నోటీసులు జారీ చేసింది సుప్రీం కోర్టు.
దిల్లీ మద్యం కేసులో కేజ్రీవాల్‌కు ప్రత్యేక న్యాయస్థానం విధించిన 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ సోమవారం ముగియాల్సి ఉంది. దీంతో ప్రస్తుతం తీహాడ్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను దిల్లీ కోర్టులోని సీబీఐ, ఈడీ ప్రత్యేక జడ్జి కావేరి బవేజా ముందు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరుపరిచారు. విచారణ కీలక దశలో ఉందని, మరో 14 రోజులు కస్టడీని పొడిగించాలని ఈడీ కోరింది. ఫలితంగా జ్యుడీషియల్ కస్టడీ పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది.
కేజ్రీవాల్ అరెస్ట్‌పై ఈడీకి నోటీసులు
ఈ మనీలాండరింగ్ కేసులో ఈడీ తనను అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై తక్షణ విచారణ జరిపేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ఏప్రిల్ 24లోగా వివరణ ఇవ్వాలని ఈడీకి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 29 తర్వాత చేపడతామని ధర్మాసనం పేర్కొంది.
'కేజ్రీవాల్‌ను కరుడుగట్టిన నేరస్థుడిలా చూస్తున్నారు'
తిహాడ్‌లో జైల్లో ఉన్న అరవింద్ కేజ్రీవాల్‌ను కరుడుగట్టిన నేరస్థుల కంటే దారుణంగా చూస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్ మాన్ ఆరోపించారు. జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను పంజాబ్ సీఎం భగవంత్ మాన్, ఆప్ ఎంపీ సందీప్ పాఠక్ కలిశారు. 'కరడుగట్టిన నేరగాళ్లకు కూడా అందుబాటులో ఉండే సౌకర్యాలు ఆయనకు అందకపోవడం బాధాకరం. ఆయన చేసిన తప్పేంటి? దేశంలోనే అతి పెద్ద ఉగ్రవాదుల్లో ఒకరిని మీరు పట్టుకున్నట్లుగా వ్యహరిస్తున్నారు. అసలు ప్రధాని మోదీ ఏం కావాలి? పారదర్శకతతో రాజకీయలకు శ్రీకారం చుట్టి, బీజేపీ రాజకీయాలను అంతం చేసిన కేజ్రీవాల్‌తో ఇలా వ్యవహరిస్తున్నారు. ఆయనను ఎలా ఉన్నారని అని నేను అడిగితే, నా గురించి మరచిపో, పంజాబ్‌లో పరిస్థితులు ఎలా ఉన్నాయో చెప్పమని నన్ను అడిగారు. ఎందుకంటే ఆప్ ఒక క్రమశిక్షణ గల పార్టీ. మేమంతా కలిసి కేజ్రీవాల్‌కు అండగా ఉన్నాం. జూన్ 4న వచ్చే ఫలితాలు తర్వాత ఆప్ అతి పెద్ద రాజకీయ శక్తిగా అవతరిస్తుంది' అని భగవంత్ మాన్ అన్నారు.