Arvind Kejriwal ED Issue : మద్యం కుంభకోణం కేసులో తాము జారీ చేసిన సమన్లకు స్పందించని నేపథ్యంలో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ- ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌పై న్యాయస్థానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్‌కు ఇప్పటివరకు ఐదుసార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు ఉటంకిస్తూ కేజ్రీవాల్ ప్రతిసారీ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ ఈ వ్యవహారంపై దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.
మద్యం కుంభకోణం కేసులో సీబీఐ అధికారులు దిల్లీ ముఖ్యమంత్రి అరవిద్ కేజ్రీవాల్‌ను ఇప్పటికే విచారించారు. 2023 ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించారు. ఈ వ్యవహారంలో ఈడీ నమోదు చేసిన కేసులో ఆయనకు ఐదుసార్లు సమన్లు జారీ చేశారు. గతేడాది నవంబరు 2, డిసెంబరు 21, ఈ ఏడాది జనవరి 3, జనవరి 18, ఫిబ్రవరి 2న విచారణకు హాజరుకావాలంటూ ఈడీ నోటీసులు జారీ చేసింది. కానీ ఈ సమన్లు చట్టవిరుద్ధమైనవని, రాజకీయ కుట్రలో భాగంగానే తనను పిలుస్తున్నారని కేజ్రీవాల్ ఆరోపించారు. ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ అరెస్టయ్యారు.
'ఇండియా కూటమి వ్యక్తిత్వమే అంత!'
ఈడీ దర్యాప్తులో పాల్గొనడానికి కేజ్రీవాల్ భయపడుతున్నారని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా విమర్శించారు. 'ఆయన మమ్మల్ని నిందించినప్పుడు అది 'హిట్ అండ్ రన్' అవుతుంది. ఆయన మీద నిందలు వచ్చినప్పుడు అది 'అవుట్ ఆన్ రన్' అవుతుంది' పూనావాలా ఎద్దేవా చేశారు. ఇండియా కూటమి వ్యక్తిత్వం మొత్తం ఇలాగే తయారయ్యిందని ఘాటుగా విమర్శించారు. ఇప్పుడు కేజ్రీవాల్ సమాధానం ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు.
'ఈ కేసు ఓ కుట్ర, రాజకీయా ప్రేరేప్రితం'
అరవింద్ కేజ్రీవాల్‌పై ఈడీ కోర్టులో ఫిర్యాదు చేయడంపై ఆప్ నేత ప్రియాంక కక్కర్ స్పందించారు. ఈ కేసు రాజకీయ ప్రేరేపితమైనదని అన్నారు. మద్యం కుంభకోణం లాంటిది ఏదీ జరగలేదని ప్రజలకు తెలుసని, అందుకే ఇప్పటివరకు తమ నాయకుల వద్ద నుంచి దర్యాప్తు సంస్థలు ఒక్క పైసా రికవరీ చేయలేకపోయాయని చెప్పారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉందన్న కక్కర్, తమ ప్రతిస్పందనను న్యాయస్థానానికి తెలియజేస్తామని చెప్పారు. ఆ తర్వాత కోర్టు ఏం ఆదేశిస్తే దానికి కట్టుబడి ఉంటామని స్పష్టం చేశారు.
ఎమ్మెల్యే కోనుగోళ్లు- కేజ్రీకి నోటీసులు
మరోవైపు, ఆప్ శాసనసభ్యులను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నించిందన్న ఆరోపణలపై ఎట్టకేలకు దిల్లీ క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు సీఎం కేజ్రీవాల్‌కు నోటీసులు అందజేశారు. ఆ ఆరోపణలపై మూడు రోజుల్లో వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పోలీసులు స్పష్టం చేశారు. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి, బెదిరించి లాక్కోవాలని చూస్తోందని కేజ్రీవాల్‌తో సహా మంత్రి అతిషీ ఇటీవల ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ.25 కోట్లు ఇస్తామని ఆఫర్ ఇచ్చినట్లు వివరించారు.
ఆప్ చేసిన ఆరోపణలపై బీజేపీ దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ వ్యవహారంలో విచారణ చేపట్టిన పోలీసులు కొనుగోలు ఆరోపణలపై ఆధారాలు ఉంటే ఇవ్వాలంటూ శుక్రవారం రాత్రి దిల్లీ సీఎంతో పాటు మంత్రి అతిషీ నివాసాలకు వెళ్లి నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించారు. అయితే ఇరువురు నేతలు నోటీసులు తీసుకునేందుకు నిరాకరించారు. ఇవాళ ఉదయం కూడా రెండోసారి నోటీసులు ఇచ్చేందుకు కేజ్రీవాల్ ఇంటికి క్రైమ్‌బ్రాంచ్ పోలీసులు వెళ్లారు. ఈ క్రమంలో నోటీసులు అందజేసినట్లు పోలీసులు పేర్కొన్నారు.
మహారాష్ట్రలో కలకలం- శిందే వర్గం నేతపై బీజేపీ MLA కాల్పులు- సీఎంపై సంచలన ఆరోపణలు