Arvind Kejriwal Ed Enquiry : మద్యం కుంభకోణం కేసులో గత కొంతకాలంగా ఈడీ సమన్లను తిరస్కరిస్తూ వస్తోన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, ఎట్టకేలకు విచారణకు హాజరయ్యేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అయితే, మార్చి 12 తర్వాతే తాను దర్యాప్తు సంస్థ ఎదుట హాజరవుతానని అన్నారు. ఈ మేరకు తాజా సమన్లకు ఇచ్చిన సమాధానంలో సీఎం పేర్కొన్నట్లు దిల్లీ ప్రభుత్వ వర్గాలు సోమవారం వెల్లడించాయి.
'వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరవుతా'
దిల్లీ మద్యం కుంభకోణం కేసులో విచారణ కోసం మార్చి 4న రావాలని ఇటీవల కేజ్రీవాల్‌కు ఈడీ ఎనిమిదోసారి సమన్లు జారీ చేసింది. ఈసారీ గైర్హాజరైన కేజ్రీవాల్ ఈడీకి తన సమాధానం పంపారు. దర్యాప్తు సంస్థ సమన్లు చట్ట విరుద్ధమని మరోసారి ఆరోపించారు. అయినప్పటికీ వారి ప్రశ్నలకు జవాబు చెప్పేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అయితే, మార్చి 12 తర్వాత వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరవుతానని అన్నట్లు ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.
కేజ్రీవాల్‌పై బీజేపీ విమర్శలు
ఈడీకి సమన్లకు కేజ్రీవాల్ సమాధానం ఇవ్వడంపై బీజేపీ స్పందించింది. దిల్లీ ముఖ్యమంత్రి ఈడీ సమన్లు జారీ చేసినప్పటి నుంచి విచారణకు హాజరయ్యేందుకు సాకులు చెబుతున్నారని ఆరోపించింది. ' కేజ్రీవాల్‌కు ఈడీ సమన్లు ఇవ్వడంపై ఆయన ప్రతీకార రాజకీయం అంటున్నారు. అలా అయితే కోర్టు ఎందుకు ఈ కేసుపై స్టే ఇవ్వలేదు.' అని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా తెలిపారు.
Delhi Excise Policy Case : మద్యం కుంభకోణం కేసులో విచారణ నిమిత్తం జారీ చేసిన నోటీసులకు సీఎం స్పందించకపోవడం వల్ల ఈడీ కొద్దిరోజుల క్రితం కోర్టును ఆశ్రయించింది. ఈ ఫిర్యాదుపై ఇటీవల న్యాయస్థానం నోటీసులు జారీ చేయడం వల్ల కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యారు. ఆయన అభ్యర్థన మేరకు తదుపరి విచారణను కోర్టు మార్చి 16వ తేదీకి వాయిదా వేసింది.
ఏడు సార్లు కేజ్రీ గైర్హాజరు- ఎనిమిదో సారైనా?
మద్యం కుంభకోణం కేసులో విచారించేందుకు ఈడీ ఇప్పటివరకు ఎనిమిది సార్లు కేజ్రీవాల్‌కు సమన్లు జారీ చేసింది. గతేడాది నవంబర్ 2 నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి 27వరకు ఎనిమిది సార్లు ఈడీ సమన్లు ఇచ్చింది. కానీ ఆయన ఒక్కసారి కూడా ఈడీ విచారణకు హాజరు కాలేదు.
కాగా, మద్యం కుంభకోణం కేసులో ఇప్పటికే సీబీఐ కేజ్రీవాల్‌ను విచారించింది. గతేడాది ఏప్రిల్‌లో 9 గంటల పాటు ప్రశ్నించింది. తాజాగా ఈడీ నమోదు చేసిన కేసులోనూ వరుసగా సమన్లు అందుతున్నాయి. ఇక ఇదే కేసులో దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా, ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్ జైల్లో ఉన్నారు.
'రాజీనామా చేస్తున్నా- ఆ విషయంపై అప్పుడే మాట్లాడతా'- కలకత్తా హైకోర్టు జడ్జి సంచలన నిర్ణయం