Arvind Kejriwal ED Case : మనీలాండరింగ్ కేసులో భాగంగా దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ సన్నిహితులపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ దాడులు చేసింది. మంగళవారం ఉదయం కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ సహా ఆప్‌తో సంబంధం ఉన్న పలువురి ఇళ్లలో ఈడీ సోదాలు జరిపింది. దిల్లీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు ఈడీ అధికారులు చెప్పారు. దిల్లీ సీఎం వ్యక్తిగత కార్యదర్శి వైభవ్ కుమార్, దిల్లీ జలబోర్డు మాజీ సభ్యుడు శలభ్‌కుమార్, ఆప్ రాజ్యసభ ఎంపీ, జాతీయ కోశాధికారి N.D.గుప్తా కార్యాలయంతోపాటు మరికొందరు నివాసాలు, కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేపట్టింది.
ఈడీకి సంబంధించి కీలక విషయాన్ని వెల్లడించనున్నట్లు దిల్లీ కేబినెట్ మంత్రి అతిషి పేర్కొన్న మరుసటిరోజే ఈడీ సోదాలు జరగటం ప్రాధాన్యం సంతరించుకుంది. మరో మంత్రి సౌరభ్ భరద్వాజ్ కూడా బీజేపీకి చెందిన బెదిరింపు విభాగం-ED గురించి కీలక విషయాలను గుట్టురట్టు చేయనున్నట్లు తెలిపారు. వైభవ్ కుమార్ అంతకుముందు దిల్లీ జలబోర్డులో సభ్యుడిగానూ పనిచేశారు.
ఈడీపై దిల్లీ మంత్రి ఫైర్
మరోవైపు ఈడీ దాడులపై దిల్లీ మంత్రి అతిషి దుయ్యబట్టారు. గత రెండేళ్లుగా ఆప్ నేతలను వేధింపులకు గురి చేస్తున్నారని చెప్పారు. ఇప్పటికే అనేక సార్లు సమన్లు జారీ చేసినా, కొందరిని అరెస్ట్ చేసినా, ఒక్క రూపాయిని సైతం ఈడీ రికవరీ చేయలేదని తెలిపారు. ఎక్సైజ్ పాలసీ కుంభకోణంలో తప్పుడు సాక్ష్యాలు చెప్పాలంటూ ఆప్ నేతలను ఈడీ బెదిరిస్తోందని ఆరోపించారు. ఆప్‌ను సైలెంట్‌గా ఉంచేందుకే ఈడీ దాడులు చేపిస్తున్నారంటూ బీజేపీపై మండిపడ్డారు.
కేజ్రీవాల్‌పై ఈడీ ఫిర్యాదు
Arvind Kejriwal ED Issue : మద్యం కుంభకోణంలో మనీ లాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలంటూ కేజ్రీవాల్‌ను కోరింది ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్. అయితే, ఈడీ జారీ చేసిన సమన్లకు స్పందించని నేపథ్యంలో కేజ్రీవాల్‌పై న్యాయస్థానంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఫిర్యాదు చేసింది. కేజ్రీవాల్‌కు ఇప్పటివరకు ఐదుసార్లు ఈడీ సమన్లు జారీ చేసింది. అయితే పలు కారణాలు ఉటంకిస్తూ కేజ్రీవాల్ ప్రతిసారీ విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఈడీ ఈ వ్యవహారంపై దిల్లీలోని రౌజ్ అవెన్యూ కోర్టును ఈడీ ఆశ్రయించింది. అరవింద్ కేజ్రీవాల్ విచారణకు సహకరించడం లేదని ఫిర్యాదు చేసింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు, తదుపరి విచారణను ఫిబ్రవరి 7కు వాయిదా వేసింది.
బంగాల్‌లోనూ ఈడీ దాడులు
మరోవైపు బంగాల్లోని పలు ప్రాంతాల్లో ఏక కాలంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరెట్ అధికారులు చేపట్టారు. ఉపాధి హామీ నిధుల అక్రమాలపై దర్యాప్తులో భాగంగా పలువురు అధికారుల ఇళ్లలో సోదాలు నిర్వహించారు.