Arvind Kejriwal Daily Routine : మద్యం కుంభకోణం కేసులో దిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్‌కు కోర్టు 15 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన రెండు వారాల పాటు తిహాడ్ జైలులోనే ఉండనున్నారు. నేటి సాయంత్రం (ఏప్రిల్ 1)ఆయన్ను భారీ భద్రత నడుమ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్‌కు జైలులో రెండో నంబరు గదిని కేటాయించినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయిన దిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా కూడా ప్రస్తుతం ఇదే జైలులో ఒకటో నంబరు గదిలో ఉంటున్నారు. ఆప్ ఎంపీ సంజయ్‌సింగ్‌కు కూడా ఇదే జైలులో ఐదో నంబరు గదిని కేటాయించారు. మరో ఆప్ నేత సత్యేందర్ జైన్ ఏడో నంబరు గదిలో ఉన్నారు.
జైల్లో కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఇలా ఉండనుంది :
మిగతా ఖైదీలకు లాగే కేజ్రీవాల్ డైలీ రొటీన్ ఉదయం 6.30 గంటలకు మొదలవ్వనుంది. టిఫిన్‌లో భాగంగా చాయ్, కొన్ని బ్రెడ్ స్లైస్‌లు ఇవ్వనున్నారు. ఆ తర్వాత కాలకృత్యాలు ముగించుకుని ఆయన్ను కోర్టు విచారణ ఉంటే తీసుకెళ్తారు. లేదంటే తన న్యాయబృందంతో సీఎం సమావేశమయ్యేందుకు అనుమతి ఉంది.
ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య కేజ్రీవాల్‌కు లంచ్ ఇవ్వనున్నారు. అన్నం, కూర, పప్పు వీటితో పాటు ఐదు రొట్టెలును కూడా ఇస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుంచి 3 గంటల వరకు సీఎం తన గదిలోనే ఉండాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో చాయ్, రెండు బిస్కట్లను ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లను కేజ్రీవాల్ కలిసే అయ్యే అవకాశం ఉంటుంది. సాయంత్రం 5.30 గంటలకే రాత్రి పూట భోజనాన్ని ఇవ్వనున్నారు. రాత్రి 7 గంటలకల్లా మళ్లీ ఆయన్ను సెల్‌లోకి పంపిస్తారు.
కేజ్రీవాల్‌కు జైలు సిబ్బంది ఇవ్వనున్న సదుపాయాలు ఇవే :
సీఎంకు టీవీ చూసే సదుపాయాన్ని కల్పించారు జైలు సిబ్బంది. సుమారు 18 నుంచి 20 ఛానళ్ల వరకు ఆయన చూసేందుకు అనుమతించారు. 24/7 వైద్య సిబ్బంది కూడా ఆయన కోసం అందుబాటులో ఉంటారు. డయాబెటీస్‌తో కేజ్రీవాల్ బాధపడుతున్నందున ఆయనకు రెగ్యులర్ చెకప్‌లు చేయనున్నారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా ప్రత్యేక డైట్ ఇవ్వాలంటూ ఆయన లాయర్లు ఇటీవలే అభ్యర్థించారు. ఇక, కేజ్రీవాల్ వారానికి రెండుసార్లు తన కుటుంబసభ్యులతో మాట్లాడొచ్చే అవకాశం కల్పించారు.
మరోవైపు జైల్లో తనకు రామాయణం, భగవద్గీత, హౌ ప్రైమ్‌మినిస్టర్స్ డిసైడ్, ఇలా మూడు పుస్తకాలను అనుమతించాలంటూ కేజ్రీవాల్ తాజాగా కోర్టును అభ్యర్థించారు. టేబుల్, కుర్చీ, మెడిసిన్స్ కూడా అనుమతించాలంటూ ఆయ కోర్టును కోరారు. ఇందుకు న్యాయస్థానం అంగీకరించిందా లేదా అన్న విషయంపై స్పష్టత లేదు.
'లిక్కర్ స్కామ్ డబ్బు ఎక్కడో ఆయన గురువారం చెబుతారు!': కేజ్రీవాల్ భార్య సునీత - Sunita Kejriwal