Congress Mahalakshmi Rumours : సార్వత్రిక ఎన్నికల్లో గెలుపు కోసం కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఓ హామీ మహిళలను పోస్టాఫీస్‌కు పరుగులు పెట్టిస్తోంది. ఇండియా కూటమి కేంద్రంలో అధికారంలో వస్తే ప్రతి మహిళ అకౌంట్లో నెలకు రూ.8వేల 500 జమ చేస్తామంటూ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటతో పోస్టాఫీస్‌లో ఖాతాలు తెరిచేందుకు మహిళలు ఎగబడుతున్నారు. రాహుల్ గాంధీ సహా కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొన్న ప్రతీ సభలోనూ ఇదే హామీని పదే పదే ప్రకటించడం వల్ల బెంగుళూరులోని జనరల్ పోస్టాఫీసులో మైనార్టీ వర్గాలకు చెందిన మహిళలు ఖాతా తెరిచేందుకు క్యూ కట్టారు. అయితే, వారిలో కొందరికి ఏ పార్టీ అధికారంలోకి వస్తే తమకు డబ్బులు వస్తాయో కూడా తెలియని పరిస్థితి ఉంది.
'ఖాతా తెరిచిన రోజు నుంచే డబ్బు'
ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతా తెరిస్తే నెలకు రూ. 8,500 వస్తాయని తెలిసిందని, అందుకే ఉదయాన్నే క్యూలో నిల్చున్నానని ఓ మహిళ చెప్పారు. ఖాతా తెరిచిన రోజు నుంచే డబ్బు రావడం ప్రారంభమవుతుందని చుట్టుపక్కల అందరూ చెబుతున్నారని, అందుకే తాను కూడా ఖాతా తెరవడానికి వచ్చానని మరో మహిళ తెలిపారు.
"తమ ఖాతాలో రూ. 2 వేలు లేదా రూ.8 వేల 500 జమ అవుతాయనే నమ్మకంతో ప్రజలు ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాలు తెరిచేందుకు వస్తున్నారు. నిజానికి ఇది ఒక పుకారు. ఈ మహిళలకు పోస్టల్ డిపార్ట్మెంట్ ఎలాంటి మొత్తాన్ని చెల్లించదు. అయితే ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంకు ఖాతాను ఏ రకమైన ఆన్లైన్ లావాదేవీకైనా లేదా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్సఫర్ పథకానికైనా ఉపయోగించవచ్చు."అని చీఫ్ పోస్ట్ మాస్టర్ మంజేష్ వివరించారు.
ఈ విషయాన్ని ఇప్పటికే వినియోగదారులకు చెప్పామన్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో పోస్టర్లను కూడా అంటించామన్నారు. అయినప్పటికీ ఖాతాలు తెరిచేందుకు మహిళలు వస్తూనే ఉన్నారన్నారు. గతంలో ఒక బ్రాంచీలో 50 నుంచి 60 ఖాతాలు తెరిచేవారమని, ఇప్పుడు రోజూ 500 నుంచి 600 ఖాతాలు, ఒక్కోసారి 1000 ఖాతాలు కూడా తెరుస్తున్నామని వాపోయారు.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద బీపీఎల్ కుటుంబాలకు రూ.2 వేలు అందిస్తోంది. అదే తరహాలో బీపీఎల్ మహిళల ఖాతాల్లో రూ.8,500 జమచేసే మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభిస్తామని లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
'మోదీ గ్యారంటీ- పోస్టాఫీస్ అకౌంట్‌తో రూ.3వేలు'- రూమర్స్‌తో ఎగబడ్డ మహిళలు
ప్రభుత్వ పాఠశాలలో చేరితే స్టూడెంట్ అకౌంట్లో రూ.1000 డిపాజిట్- ఎక్కడంటే?