How To Make Guntur Style Ginger Chutney : చాలా మంది నిలువ పచ్చళ్లను ఎంతో ఇష్టంగా తింటుంటారు. అందులో మెజార్టీ పీపుల్ ఆవకాయను ఇష్టపడుతుంటారు. అయితే, మామిడికాయతో మాత్రమే కాదు.. అల్లంతోనూ ఎక్కువ రోజులు నిల్వ ఉండేలా చట్నీ ప్రిపేర్ చేసుకోవచ్చు. అది కూడా గుంటూరు స్టైల్లో కాస్త స్పైసీగా ఉండేలా ఈజీగా తయారుచేసుకోవచ్చు. ఈ "అల్లం చట్నీ"ని(Ginger Chutney) అన్ని రకాల టిఫెన్స్లో తినొచ్చు. అంతేకాదు.. ఇంట్లో కూర చేసుకోనప్పుడు వేడివేడి అన్నంలో ఈ చట్నీతో పాటు కాస్త నెయ్యి వేసుకొని తిన్నా సూపర్ టేస్టీగా ఉంటుంది! ఇంతకీ.. దీని తయారీకి కావాల్సిన పదార్థాలేంటి? ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కావాల్సిన పదార్థాలు :
- నూనె - 3 టేబుల్‌స్పూన్లు
- అల్లం - 50 గ్రాములు
- మినపప్పు - 1 టేబుల్‌స్పూన్
- ధనియాలు - 1 టేబుల్‌స్పూన్
- శనగపప్పు - 1 టేబుల్‌స్పూన్
- ఎండుమిర్చి - 50 గ్రాములు
- బెల్లం - 100 గ్రాములు
- చింతపండు - 50 గ్రాములు
- జీలక్రర - 1 టేబుల్‌స్పూన్
- వెల్లుల్లి రెబ్బలు - 6
- ఉప్పు - రుచికి సరిపడా
తయారీ విధానం :
- ఇందుకోసం ముందుగా అల్లం పొట్టు తీసి సన్నని ముక్కలుగా తరుక్కోవాలి. అలాగే రెసిపీలోకి కావాల్సిన చింతపండును వాటర్‌లో నానబెట్టుకోవాలి. అదేవిధంగా బెల్లం తరుగుని ప్రిపేర్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి.
- ఇప్పుడు స్టౌపై పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. అది కాస్త హీట్ అయ్యాక శనగపప్పు, ధనియాలు, మినపప్పు వేసి దోరగా మాగే వరకు వేయించుకోవాలి.
- ఆ తర్వాత అందులో ఎండుమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడు మిశ్రమం బాగా వేగిందనుకున్నాక.. ముందుగా తరిగి పెట్టుకున్న అల్లం ముక్కలనూ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి.
- ఇక్కడ మీరు రెసిపీలోకి ఎండుమిర్చి ఎంత తీసుకుంటే అల్లం అంతే మొత్తంలో తీసుకోవాలనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. అలాగే ఎండుమిర్చి మంచి నాణ్యమైనవి ఎంచుకోవడం బెటర్. లేదంటే.. సతకగా ఉన్నవి ఎన్ని వేసినా సరైన టేస్ట్ రాదు!
- అనంతరం ఆ మిశ్రమాన్ని పూర్తిగా చల్లార్చుకోవాలి. ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించుకొని చల్లార్చుకున్న ఎండుమిర్చి మిశ్రమం, బెల్లం, ముందుగా నానబెట్టి పెట్టుకున్న చింతపండు గుజ్జు, జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి.
- వీటితో పాటు ముఖ్యంగా కొద్దిగా వేడినీళ్లు పోసుకొని మిశ్రమాన్ని చట్నీలా బ్లెండ్ చేసుకోవాలి. అంతే.. సూపర్ టేస్టీగా ఉండే గుంటూర్ స్టైల్ అల్లం పచ్చడి రెడీ!
- అయితే, ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయమేమిటంటే.. చట్నీ రుబ్బుకునేటప్పుడు చల్లని వాటర్ పోస్తే త్వరగా పచ్చడి పాడైపోతుంది!
- ఆవిధంగా చట్నీని రుబ్బుకున్నాక కాస్త కాచి చల్లార్చిన ఆయిల్ పోసుకుని మిక్స్ చేసుకుంటే 15 నుంచి 20 రోజుల పాటు తాజాగా ఉంటుంది.
- అదే మీరు ఈ పచ్చడిని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకుంటే దాదాపు 2 నుంచి 3 నెలలు ఫ్రెష్‌గా నిల్వ ఉంటుంది!
ఇవీ చదవండి :
నూనె లేదు, పొయ్యితో పనేలేదు! - ఆహా అనిపించే "పొలం పచ్చడి" ఐదు నిమిషాల్లో - జిందగీలో తిని ఉండరు!
ఆంధ్రా స్టైల్లో చికెన్ పచ్చడి - ఇలా ప్రిపేర్ చేశారంటే సూపర్ టేస్ట్!