Aditya Thackeray on Rahul Gandhi : రాహుల్ గాంధీ దేశానికి ప్రధానమంత్రి అవ్వాలంటే భారతీయ జనతా పార్టీలోకి చేరాలంటూ శివసేన ఎమ్మెల్యే ఆదిత్య ఠాక్రే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మహానిష్ఠ, మహాన్యాయ, మహారాష్ట్ర' ప్రచారంలో పాల్గొన్న ఆదిత్య ఠాక్రే, రాహుల్‌కు సూచనలిస్తూ కమలం పార్టీపై విమర్శలు గుప్పించారు.
'బీజేపీ కార్యకర్తలను చూస్తే నాకు చాలా బాధగా ఉంది. ఎందుకంటే అక్కడ పదవులు పొందిన నాయకులంతా బయట(వేరే పార్టీలు) నుంచి వెళ్లిన వ్యక్తులే. అందుకే నేను రాహుల్ గాంధీ కూడా సలహా ఇస్తున్నా. ప్రధానమంత్రి అవ్వాలంటే మీరు కూడా బీజేపీలోకి వెళ్లండి. ఎందుకంటే అక్కడ అందరూ కాంగ్రెస్ వాళ్లే ఉన్నారు. ఇప్పుడు బీజేపీ 'దాగ్ అచ్ఛే హై, వాషింగ్ పౌడర్ బీజేపీ' అనే కొత్త నినాదాన్ని ప్రారంభించింది. ద్రోహులు, అవినీతిపరులంతా బీజేపీలోనే ఉన్నారు' అని ఆదిత్య ఠాక్రే ఆరోపించారు.
బీజేపీతోపాటు రాష్ట్ర ప్రభుత్వంపై కూడా విమర్శలు చేశారు ఆదిత్య ఠాక్రే. 'ప్రస్తుత ప్రభుత్వం గతంలో చేసిన అభివృద్ధి పనుల్లోనే మునిగిపోయి ఉంది. మేం భవిష్యత్తు కోసం పని చేసే వ్యక్తులం. శిందే ప్రభుత్వానికి మహారాష్ట్ర అభివృద్ధితో పని లేదు. అన్ని పరిశ్రమలను గుజరాత్‌కు తరలిస్తోంది. ఎన్నికల ముందు నినాదాలను మాత్రమే మారుస్తుంది. కానీ ఎటువంటి అభివృద్ధి పనులు మాత్రం జరగవు' అని ఆదిత్య విమర్శించారు.
భారత్ జోడో న్యాయ్ యాత్ర తిరిగి ప్రారంభం
మరోవైపు ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ నుంచి భారత్ జోడో న్యాయ్ యాత్రను ఆదివారం మధ్యాహ్నం తిరిగి ప్రారంభించనున్నారు రాహుల్. శనివారం ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న కేరళలోని వయనాడ్ నియోజకవర్గానికి వెళ్లడం వల్ల ఈ యాత్రకు స్వల్ప విరామం ఇచ్చారు. న్యాయ్ యాత్ర ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లో తిరిగి ప్రారంభమవుతుందని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ జైరాం రమేష్ ఎక్స్ వేదికగా తెలిపారు.
ఇటీవల కేరళలోని వయనాడ్‌లో వరుసగా ఏనుగులు ప్రజలపై దాడులు చేస్తుండడం వల్ల ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రను శనివారం తాత్కాలికంగా నిలిపివేసి హుటాహుటిన కేరళ వెళ్లారు. ఏనుగుల వల్ల మృతి చెందిన అటవీ సిబ్బంది వీపీ పాల్ కుటుంబాన్ని రాహుల్ పరామర్శించారు.
'ఏదైనా ఉంటే మీకే ముందు చెప్తా'- బీజేపీలో చేరికపై కమల్‌నాథ్ క్లారిటీ