Aditi Yadav Election Campaign : సార్వత్రిక ఎన్నికల సమరంలో తమ వారిని గెలిపించుకునేందుకు కుటుంబ సభ్యులు కూడా విస్తృతంగా ప్రచారంలో పాల్గొంటున్నారు. భర్తలను గెలిపించుకునేందుకు భార్యలు, భార్యలను విజయ తీరాలకు చేర్చేందుకు భర్తలు, ప్రచార బరిలో దిగి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బాటలో ఉత్తర్‌ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్-డింపుల్ దంపతుల ముద్దుల తనయ అదితి యాదవ్ కూడా పయనిస్తున్నారు.
మెయిన్‌పురి లోక్‌సభ స్థానం నుంచి అఖిలేశ్ యాదవ్ సతీమణి డింపుల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. తన తల్లికి మద్దతుగా అదితి యాదవ్ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. డింపుల్ యాదవ్ మెయిన్‌పురిలో తన కుమార్తె అదితి యాదవ్‌తో కలిసి మంగళవారం ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్నారు. లండన్‌లో చదువుకొని సెలవుల్లో తల్లిదండ్రుల దగ్గరకు వచ్చిన అదితిని చూసేందుకు ఓటర్లు ఉత్సాహం చూపిస్తున్నారు. ఈ క్రమంలో అదితి తన పదునైన ప్రసంగాలతోనూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.
మూలయంసింగ్ వారసత్వం
ములాయంసింగ్ యాదవ్ మూడోతరం రాజకీయ వారసత్వాన్ని అదితి యాదవ్ ముందుకు తీసుకెళ్తున్నారు. 1996 నుంచి సమాజ్‌వాదీ పార్టీకి కంచుకోటగా ఉన్న మెయిన్‌పురి స్థానంలో తన తల్లిని గెలిపించుకునేందుకు అదితి తన వంతు కృషి చేస్తున్నారు. ములాయం సింగ్ మరణానంతరం డింపుల్ యాదవ్ ఈ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో విజయం సాధించారు. ప్రస్తుతం మెయిన్‌పురి ఎంపీగా ఉన్నారు. అయితే ఈసారి డింపుల్ గెలుపు అంత సులభం కాదన్న విశ్లేషణల నేపథ్యంలో అదితి యాదవ్ కూడా ప్రచారంలో పాల్గొంటున్నారు.
మోదీ ప్రభుత్వంపైనే అదితి గురి!
Aditi Yadav Comments On PM Modi : ఇటీవల జరిగిన ఎన్నికల ర్యాలీలో తన ప్రసంగంతో అదితి ఆకట్టుకున్నారు. బీజేపీ పాలనలో దేశంలోని అన్ని వర్గాలు అష్టకష్టాలు పడుతున్నాయని, ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్రం రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్ర చేస్తోందని అదితి విమర్శించారు. సామాన్యులు పొందుతున్న సామాజిక, ఆర్థిక ప్రయోజనాలను ధ్వంసం చేసేందుకు కమలం పార్టీ శతవిథాల ప్రయత్నిస్తోందని అదితి విమర్శలు గుప్పించారు.
సమాజ్‌వాదీ పార్టీకి, దాని సిద్ధాంతాలకు ప్రజలు మద్దతు ఇవ్వాలని అదితి యాదవ్ ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణంపై కేంద్ర ప్రభుత్వంపై అఖిలేశ్ గారాలపట్టి అదితి సూటిగా విమర్శలు చేస్తూ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల సమయంలో మాత్రమే ఉద్యోగాలు కల్పిస్తోందని, పేపర్లు కూడా లీక్ చేస్తోందని అదితి వ్యంగ్యాస్త్రాలు సైతం సంధిస్తున్నారు.
ఇవే కీలక ఎన్నికలు: అదితి
దేశంలో ద్రవ్యోల్బణం పెరుగుతోందని, గ్యాస్, పెట్రోల్ సహా అన్నింటి ధరలు పెరుగుతున్నాయని ప్రజలను హెచ్చరిస్తూ ప్రసంగాలు దంచేస్తున్నారు అదితి యాదవ్. వచ్చే సార్వత్రిక ఎన్నికలు దేశానికి చాలా కీలకమని, గత ఎన్నికల్లో ప్రతి ఖాతాలో రూ.14 లక్షలు, రెండు కోట్ల ఉద్యోగాలు, ఉచిత గ్యాస్ సిలిండర్లు, పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని బీజేపీ భారీ హామీలిచ్చిందని, కానీ ఒక్క హామీని కూడా వారు నెరవేర్చలేదని ప్రజలకు వివరిస్తున్నారు అఖిలేశ్ కూతురు. ప్రతిపక్ష కూటమిని చూసి బీజేపీ భయపడుతోందని కూడా అదితి తన ప్రచారంలో అంటున్నారు. ఇండియా కూటమికి ప్రజల మద్దతు లభిస్తోందని, బీజేపీ మాటలకు, చేతలకు అసలు పొంతనే లేదని ఆమె విమర్శిస్తున్నారు.
రెండు దశాబ్దాలుగా ఎస్పీదే హవా!
ములాయం సింగ్ యాదవ్‌ను తొలిసారిగా పార్లమెంటుకు పంపిన ఘనత మెయిన్‌పురి ప్రజలకే దక్కుతుంది. అప్పటి నుంచి ఈ స్థానం నుంచి సమాజ్‌వాదీ పార్టీ అభ్యర్థులు గెలుస్తూనే ఉన్నారు. తేజ్ ప్రతాప్, ధర్మేంద్ర యాదవ్ కూడా ఈ స్థానం నుంచే పార్లమెంటు సభ్యులయ్యారు. 2011 జనాభా లెక్కల ప్రకారం మెయిన్‌పురి జిల్లాలో 93.48 శాతం హిందూ జనాభా ఉంది. ఇక్కడ యాదవుల ఓట్లు నిర్ణయాత్మక పాత్ర పోషిస్తాయి. 2019లో ఇక్కడ 17.2 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. యాదవుల ఓటు బ్యాంకుకు తోడు ములాయంసింగ్ ప్రభావం కారణంగా సమాజ్‌వాదీ పార్టీ రెండు దశాబ్దాలుగా ఈ స్థానంలో హవా చాటుతోంది. ఇక ఉత్తర్‌ప్రదేశ్‌లో మొత్తం ఏడు దశల్లో- ఏప్రిల్ 19, 26, మే 7, 13, 20, 23, జూన్ 1 తేదీల్లో పోలింగ్ జరగనుంది.
ఎన్నికల్లో నా కుమారుడు ఓడిపోవాలి- కాంగ్రెస్ నా మతం: ఏకే ఆంటోనీ - AK Antony Son In Lok Sabha Polls