Kannada Actor Darshan Case : అభిమాని రేణుకాస్వామి హత్య కేసులో విచారణ ఖైదీగా ఉన్న కన్నడ నటుడు దర్శన్‌కు జైల్లో రాచమర్యాదలు లభిస్తున్నట్లు వచ్చిన ఆరోపణలు చర్చనీయాంశంగా మారాయి. ఈ క్రమంలోనే కీలక పరిణామం జరిగింది. దర్శన్‌ను బళ్లారి జైలుకు మార్చినట్లు తాజా సమాచారం. పరప్పన అగ్రహార కేంద్ర కారాగారంలో విచారణ ఖైదీగా ఉన్న దర్శన్‌ను, బెంగళూరు న్యాయస్థానం ఆదేశాల మేరకు బళ్లారి జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. ఈ కేసులో ఇతర నిందితులను కర్ణాటకలోని ఇతర జైళ్లకు తరలించనున్నట్లు సమాచారం. జైల్లో దర్శన్‌కు సంబంధించిన దృశ్యాలు ఇటీవల సోషల్‌మీడియాలో వైరల్‌గా మారడం ఈ పరిణామానికి దారి తీసినట్లు తెలుస్తోంది.
దర్శన్ కారాగారం బ్యారక్ నుంచి బయటకు వచ్చి స్నేహితులతో కూర్చొని కాఫీ, సిగరెట్ తాగుతున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. ఇది తీవ్ర చర్చకు దారి తీసింది. రౌడీషీటర్ వేలు ఆ చిత్రాన్ని రహస్యంగా సెల్‌ఫోన్‌లో బంధించి బయట ఉన్నతన భార్య సెల్‌ఫోన్‌కు పంపించినట్లు తెలుస్తోంది. దర్శన్ కలిసి కూర్చొని కాఫీ తాగుతున్న వారిలో రౌడీషీటర్ విల్సన్ గార్డన్ నాగ కూడా ఉన్నాడు.
వీడియో కాల్ ద్వారా అతడు 25 సెకన్ల పాటు అవతలి వ్యక్తితో మాట్లాడుతున్న వీడియో కూడా బయటకు రావడం అనుమానాలకు మరింత బలానిచ్చింది. దీంతో అతడికి జైలులో రాచ మర్యాదలు అందుతున్నాయని వార్తలు వెలువడ్డాయి. జైల్లో ప్రత్యేక ఏర్పాట్ల ఆరోపణల నేపథ్యంలో పోలీసు విభాగం చర్యలకు ఉపక్రమించింది. ఈ వ్యవహారంతో ఏడుగురు పోలీసు అధికారుల ప్రమేయం ఉందని ప్రాథమిక విచారణలో తేలడం వల్ల వారిపై సస్పెండ్ వేటు పడింది. ఈ నేపథ్యంలోనే న్యాయస్థానం తాజాగా ఆదేశాలు జారీ చేయడం లస్స దర్శన్‌ను మరో కారాగారానికి మార్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
బళ్లారి జైలుకు దర్శన్: ఈ కేసులో మొత్తం 17 మంది నిందితులను అరెస్టు చేశారు. వీరిలో రవి, కార్తీక్, నిఖిల్, కేశవమూర్తి ఇప్పటికే తుమకూరు జైలులో ఉన్నారు. ఈ కేసులో రెండో నిందితుడైన నటుడు దర్శన్‌ను బళ్లారి జైలుకు తరలించేందుకు తాజాగా కోర్టు అనుమతించింది. పవన్, రాఘవేంద్ర, నందీష్‌లను మైసూర్ జైలుకు, జగదీష్-శివమొగ, ధనరాజ్-ధార్వాడ్, వినయ్-విజయ్‌పూర్, నాగరాజ్-కలబురగి, లక్ష్మణ-శివమొగ, ప్రదుష్‌లను బెల్గాం జైలుకు తరలించినట్లు తెలుస్తోంది. పవిత్రా గౌడ్, అనుకుమార్, దీపక్‌లను పరప్ప అగ్రహార జైలులోనే ఉంచారు.
జైలులో నటుడు దర్శన్‌కు రాచమర్యాదలు- ఏడుగురు అధికారులు సస్పెండ్ - Special Treatment to Actor Darshan