Ahmedabad Woman Cab Driver Story : జీవితం అందరికీ ఒకేలా ఉండదు. అంతా సవ్యంగా సాగిపోతుందనే సమయంలో కోలుకోలేని ఎదురు దెబ్బలు తగులుతుంటాయి. అలాంటి వాటిని తట్టుకుని నిలబడితేనే బతుకు బండిని లాగగలం. భర్త అనారోగ్యంతో మంచాన పడితే, కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకుంది ఆ మహిళ. తనకు వచ్చిన కష్టాన్ని చూసి ఏ మాత్రం అధైర్య పడకుండా, చిరునవ్వుతో ఆ కష్టాల్ని స్వీకరించింది. సైకిల్ హ్యాండిల్ కూడా పట్టడం రాని ఆమె, ఏకంగా కారు స్టీరింగ్ పట్టి కుటుంబ రథాన్ని లాగుతోంది. స్ఫూర్తిదాయకమైన ఆ మహిళ కథను తెలుసుకున్న నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి క్యాబ్ డ్రైవర్‌గా పని చేస్తూ, కుటుంబాన్ని పోషించేవాడు. కానీ, కొంతకాలం క్రితం అతడు తీవ్ర అనారోగ్య కారణాలతో మంచానికే పరిమితమయ్యాడు. దీంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. అయితే, అతడి భార్య అర్చన పాటిల్ మాత్రం స్వయంగా క్యాబ్ డ్రైవ్ చేసేందుకు కదలింది. కేవలం రోజుల వ్యవధిలోనే డ్రైవింగ్ నేర్చుకుని లైసెన్సు పొందింది. ఒక రోజు ఆమె క్యాబ్‌ను బుక్ చేసిన ఓ వినియోగదారుడు వారి మధ్య జరిగిన సంభాషణను సోషల్ మీడియాలో పంచుకున్నాడు. ఆమె కథను లోకానికి చెప్పాడు.
"ఈ మధ్యకాలంలో ఎంతో మంది మహిళలు కుటుంబాన్ని గడిపేందుకు ఆటోలు, రిక్షాలు తొక్కడాన్ని చూస్తుంటాం. ఇందులో వింతేముంది అని చాలా మంది అనుకుంటారు. కానీ, కష్టాలు చుట్టుముట్టినప్పుడు ఆ సమస్యలను ఎంతో ధైర్యంతో ఎదుర్కొంటున్నారు. ఇది నిజంగా గొప్ప విషయమే. ఒక మహిళ విజయగాథకి అర్చన జీవితం ఒక ఉదాహరణ. దురదృష్టాన్ని ఓటమిగా భావించని ఓ వ్యక్తిని కలవడం నిజంగా సంతోషంగా ఉందని" ఆ వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అతడు పెట్టిన పోస్టుకు ఆమె ఫొటోను జత చేశాడు. ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. "ఆమె ఒక సూపర్ ఉమెన్", "మీ కథ ఎంతో మంది మహిళలకు స్ఫూర్తి", "కష్టాలకు వెరవకుండా ఇలా కూడా ఎదుర్కోవచ్చని నిరూపించారు", "మీ తెగువకు నమస్కారం, జీవితంలో మీరు ఉన్నత స్థాయిలో ఉండాలని ఆశిస్తున్నాం" అంటూ నెటిజన్లు కామెంట్లు పోస్టు చేస్తున్నారు.