Dantewada Encounter : తాజా ఎన్‌కౌంటర్‌తో ఛత్తీస్‌గఢ్ దండకారణ్యం ఉలిక్కిపడింది. దంతెవాడ- నారాయణ్‌పుర్ సరిహద్దులో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఏకంగా 36 మంది మావోయిస్టులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఎన్‌కౌంటర్‌లో ఐదు రాష్ట్రాల మోస్ట్ వాంటెడ్ నక్సలైట్ కమాండర్లు కమలేశ్ అలియాస్ ఆర్కే, నీతి అలియాస్ ఊర్మిళ మరణించినట్లు సమాచారం. ఈ ఎన్‌కౌంటర్ తర్వాత భద్రతా బలగాలు ఘటనా స్థలం నుంచి ఇప్పటివరకు 31 మంది మావోయిస్టుల మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో ఇంకా భారీ ఎత్తున కూంబింగ్ కొనసాగుతోంది. ఈ ఆపరేషన్ గురించి కీలక వివరాలను పోలీసు ఉన్నతాధికారులు మీడియాకు తెలిపారు.
మోస్ట్ వాంటెడ్ డెడ్
పోలీసుల నుంచి అందిన సమాచారం ప్రకారం, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు కమలేశ్ ఐదు రాష్ట్రాల్లో మోస్ట్ వాంటెడ్‌గా ఉన్నారు. ఆయన ప్రత్యేక మండల కమిటీ సభ్యుడిగా, అధికార ప్రతినిధిగా వ్యవహరించారు. నీతి అలియాస్ ఊర్మిళ బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతానికి చెందినవారు. కాగా, కమలేశ్ ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని తెలుస్తోంది.
పక్కా వ్యూహంతో ఎన్‌కౌంటర్
ఎన్‌కౌంటర్‌లో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ)కి చెందిన 1500 మంది పోలీసులు పాల్గొన్నట్లు దంతెవాడ అడిషనల్ ఎస్పీ ఆర్కే బర్‌మన్ వెల్లడించారు. పక్కా వ్యూహంతో 2 రోజులపాటు ఆపరేషన్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. అక్టోబరు 3 ఉదయమే ఆపరేషన్ ప్రారంభించినట్లు ఎస్పీ చెప్పారు. మావోయిస్టులకు చెందిన కంపెనీ నంబర్ 6, తూర్పు బస్తర్ డివిజన్ దళాలు గవాడి, థుల్‌థులి, నెందూర్, రెంగవయా గ్రామాల్లో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం వచ్చిందని, దానిని రూఢీ చేసుకున్న తర్వాత ఆపరేషన్ చేపట్టామని పేర్కొన్నారు.
"ఆపరేషన్ చేపట్టేందుకు మా భద్రతాబలగాలు తీవ్రంగా శ్రమించాయి. మావోయిస్టుల కంట పడకుండా ఎత్తైన కొండ ప్రాంతానికి చేరుకునేందుకు 10 కి.మీ మేర ద్విచక్రవాహనాలపై వెళ్లి, ఆ తర్వాత 12 కి.మీ మేర నడవాల్సి వచ్చింది. శుక్రవారం మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో మావోయిస్టులకు, మా భద్రతా బలగాలకు మధ్య ఎదురు కాల్పులు ప్రారంభమయ్యాయి. నెందూర్, థుల్‌థులి గ్రామాల్లో చీకటి పడేవరకు ఈ ఎదురుకాల్పులు కొనసాగాయి. శుక్రవారమే 28 మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. శనివారం మరో 3 మృతదేహాలు లభ్యమయ్యాయి. ఈ ఆపరేషన్‌కు సెంట్రల్ రిజర్వ్ పోలీసు బలగాలు కూడా సహకారం అందించాయి" అని అడిషనల్ ఎస్పీ ఆర్కే బర్‌మన్ వెల్లడించారు.
మృతి చెందిన మావోయిస్టులను పీపుల్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి చెందిన వారిగా గుర్తించామని బస్తర్ రేంజ్ ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. మృతదేహాలను పూర్తి స్థాయిలో పరిశీలించిన తర్వాత మాత్రమే వారు ఎవరెవరన్నది స్పష్టంగా తేలుతుందని చెప్పారు. ఈ ఆపరేషన్‌లో ఓ జవాన్‌కు తీవ్రంగా గాయాలయ్యాయని, ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. భారీ మొత్తంలో ఆయుధాలను స్వాధీనం చేసుకున్నట్లు సుందర్‌రాజ్ తెలిపారు. ఏకే-47 రైఫిల్, ఎస్‌ఎల్‌ఆర్, ఇన్‌సాస్, ఎల్‌ఎంజీతో సహా, మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నామని ఐజీ తెలిపారు.
సిట్టింగ్ జడ్జితో విచారణ!
ఛత్తీస్‌గఢ్‌లో శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై పౌర హక్కుల సంఘాల నేతలు స్పందించారు. పోలీసులు మృతుల ఫొటోలను, వారి వివరాలను వెంటనే విడుదల చేయాలని పౌర హక్కుల సంఘం కోరింది. ఈ ఘటనపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారించాలని డిమాండ్ చేసింది.