JK Assembly Election Amit Shah : అసెంబ్లీ ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరిస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ఆర్టికల్ 370 రద్దు చేసిన తర్వాత దేశ జాతీయ జెండా, రాజ్యాంగం కింద జమ్ముకశ్మీర్‌లో మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయని తెలిపారు. కాంగ్రెస్- నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదాన్ని పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని ఆరోపించారు. బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తూ అమిత్ షా శనివారం జమ్ములో ఈ వ్యాఖ్యలు చేశారు.
"రాష్ట్ర హోదా హామీలతో కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. అలా చేసే అధికారం రాహుల్‌గాంధీకి ఉందా?ఎన్నికల ముందు ఏ శక్తీ కూడా స్వయంప్రతిపత్తి గురించి మాట్లాడదు"
-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
'రాబోయే ఎన్నికలు చారిత్రకమైనవి'
"ఎన్డీఏ సర్కార్ ఉగ్రవాదాన్ని పునురుద్ధరణను అనుమతించదు. బీజేపీ ప్రభుత్వం కల్పించిన రిజర్వేషన్లతో గుజ్జర్లు, పహారీలు, బకర్ వాల్లు, దళితులతో సహా ఏ వర్గానికి అన్యాయం జరగదు. జమ్ముకశ్మీర్‌లో రాబోయే ఎన్నికలు చారిత్రకమైనవి. ఎందుకంటే స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటిసారి భారత జాతీయ జెండా, రాజ్యాంగం కింద మొదటిసారి ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో రెండు జెండాలు, రెండు రాజ్యాంగాల ఆధారంగా జమ్ముకశ్మీర్ లో ఎన్నికలు జరిగేవి. ప్రస్తుతం కశ్మీర్ నుంచి కన్యాకుమారి ఒకరే ప్రధాని. ఆయనే నరేంద్ర మోదీ" అని అమిత్ షా వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్-ఎన్‌సీ కూటమిపై అమిత్ షా ఫైర్
అలాగే, నేషనల్ కాన్ఫరెన్స్-కాంగ్రెస్ కూటమిపై అమిత్ షా ధ్వజమెత్తారు. జమ్ముకశ్మీర్‌లో ఎన్డీఏ సర్కార్ 70 శాతం ఉగ్రవాద ఘటనలను తగ్గించిందని తెలిపారు. అయితే మరోసారి జమ్ముకశ్మీర్‌ను ఉగ్రవాద ఊబిలోని నెట్టడానికి ఎన్‌సీ- కాంగ్రెస్ కూటమి ప్రయత్నిస్తోందని ఆరోపించారు. ఈ కూటమి ఎప్పటికీ జమ్ముకశ్మీర్‌లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేదని ఎద్దేవా చేశారు. జమ్ముకశ్మీర్ తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
పీడీపీతో కలిసి ఎన్‌సీ, కాంగ్రెస్ కూటమి ఈ ప్రాంతాన్ని ఉగ్రవాద మంటల్లోకి నెట్టేందుకు ప్రయత్నించిందని ఆరోపించారు. "ఆ మూడు కుటుంబాలే జమ్మూకశ్మీర్‌ను దోచుకున్నాయి. ప్రజల హక్కులను కాలరాయడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఆ కూటమి ఒకవేళ అధికారంలోకి వస్తే ఉగ్రవాదం మళ్లీ విజృంభిస్తుంది. భాజపా అధికారంలో ఉంటే టెర్రరిజాన్ని నాశనం చేస్తుంది. ఉగ్రవాదం అంతమయ్యేవరకు పాకిస్థాన్‌తో చర్చలు ఉండవు" అని మరోసారి పునరుద్ఘాటించారు.