చెరువులో 64 రౌండ్లు.. 8 గంటలపాటు నాన్‌స్టాప్‌గా ఈత.. ప్రపంచ రికార్డు సృష్టించిన చంద్రకళ!
ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అమ్మాయి ప్రపంచ రికార్డు సృష్టించింది! నిర్విరామంగా 8 గంటల పాటు ఈత కొట్టి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ చోటు సంపాదించింది. దుర్గ్ జిల్లాలోని పురాయి గ్రామానికి చెందిన 15 ఏళ్ల చంద్రకళ ఓజా ఈ రికార్టును సొంతం చేసుకుంది. చంద్రకళ ఆదివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు నిర్విరామంగా ఈత కొట్టింది. ఆ కార్యక్రమానికి గ్రామస్థులు, రాష్ట్ర హోం శాఖ మంత్రి తామ్రాధ్వాజ్ సాహూ కూడా హాజరయ్యారు. వీరితో పాటుగా ఆ రికార్డును నమోదు చేసేందుకు గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ బృందం కూడా హాజరైంది. వీరు చంద్రకళ ఈత కొట్టిన మొత్తం దృశ్యాన్ని వీడియో తీశారు. చంద్రకళ 8 గంటల పాటు చెరువులో 64 రౌండ్లు ఈత కొట్టింది. రికార్డు సృష్టించిన చంద్రకళ చెరువు నుంచి బయటకు రాగానే స్థానికులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం వైద్యులు ఆమెకు వైద్య పరీక్షలు కూడా నిర్వహించారు. ఈతలో ప్రపంచ రికార్డు సృష్టించినందుకు చాలా సంతోషంగా ఉందని.. తాను సాధించిన ఈ విజయం వెనుక తల్లిదండ్రులు, గ్రామస్థులతో పాటు హోంమంత్రి కూడా మద్దతుగా నిలిచినట్లు చంద్రకళ తెలిపింది. పురాయికి చెందిన పిల్లలు క్రీడల్లో రాణిస్తున్నందున ఈ ప్రాంతంలో స్పోర్ట్స్ అకాడమీని ఏర్పాటు చేస్తామని హోంమంత్రి హామీ ఇచ్చారు.