Villagers carried an injured farmer for 15 km : గాయపడ్డ రైతును భుజాలపై మోస్తూ 15 కి.మీ నడక.. ఐదు రోజులు ఇంట్లోనే చికిత్స.. రోడ్డు లేక..
Published : Aug 28, 2023, 8:51 PM IST
Villagers carried an injured farmer for 15 km :గాయపడ్డ రైతును భుజాలపై మోస్తూ 15 కిలోమీటర్లు నడిచి ఆస్పత్రికి తీసుకెళ్లారు గ్రామస్థులు. ఈ ఘటన కర్ణాటక ఉత్తర కన్నడ జిల్లాలోని అంకోలా గ్రామ పరిధిలోని కెండగిలో జరిగింది. కెండగి గ్రామానికి చెందిన ఉమేశ గౌడ అనే రైతు.. వ్యవసాయ పనులు చేస్తూ గాయపడ్డారు. ఈ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం కూడా లేదు. మరోవైపు గ్రామ సమీపంలో వరద ఉద్ధృతంగా ప్రవహిస్తుండడం వల్ల ఆస్పత్రికి తరలించడం కష్టంగా మారింది. దీంతో ఐదు రోజులుగా ఇంట్లోనే చికిత్స అందించారు కుటుంబ సభ్యులు. తాజాగా వరద ప్రవాహం తగ్గడం వల్ల ఆస్పత్రికి తరలించేందుకు సిద్ధమయ్యారు కుటుంబ సభ్యులు. గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల భుజాలపై మోస్తూ.. దాదాపు 15 కిలోమీటర్లు నడిచి వెళ్లారు. అనంతరం హట్టికెరి గ్రామం నుంచి అంబులెన్స్‌లో కర్వార్ మెడికల్ కాలేజీకి తరలించారు.
తమ గ్రామానికి సరైన రోడ్డు సౌకర్యం లేకపోవడం వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు గ్రామస్థులు. నిత్యావసర సరకులు కోసం కూడా దాదాపు 18 కిలోమీటర్ల దూరంలోని హట్టికెరి గ్రామానికి నడుస్తూ వెళ్లాల్సి వస్తుందని చెప్పారు. వీలైనంత త్వరగా రోడ్డు సదుపాయం కల్పించాలని కోరుతున్నారు.