భద్రాద్రి రాముల వారికి ఘనంగా ఊంజల్ సేవ
Voonjal Seva Utsavs to Ramayya in Bhadradri: శ్రీరామ నవమి సందర్భంగా భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో తిరు కల్యాణ బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా సోమవారం సాయంత్రం లక్ష్మణ సమేత సీతారాములకు ఊంజల్ సేవ ఉత్సవం ఘనంగా జరిగింది. ముందుగా ఆలయంలోని లక్ష్మణ సమేత సీతారాములను బేడ మండపం వద్దకు తీసుకువచ్చి ఊయలలో వేంచేపింప చేసి పూజలు నిర్వహించారు. హరిదాసులు, భక్త రామదాసు రచించిన కీర్తనలు ఆలపిస్తుండగా, అర్చకులు సీతారాములకు ధూప దీప నైవేద్యాలు సమర్పించారు. అనంతరం స్వామివారికి బంగారు సింహ వాహనంపై తిరు వీధి నిర్వహించారు. ఆలయం నుంచి స్వామివారిని చిత్రకూట మండపం వద్దకు తీసుకువచ్చి సింహ వాహనంపై కూర్చుండబెట్టి తిరు వీధుల్లో ఊరేగించారు. ఈ సందర్భంగా స్వామివారికి భక్తులు ఎదురొచ్చి హారతులు అందించారు. ఆలయ అర్చకులు సీతారాముల విశిష్టతను భక్తులకు తెలియజేశారు. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ఉదయం స్వామివారికి వసంతోత్సవం వేడుక నిర్వహించారు.