Road Damaged Due To Heavy Rains in Mulugu : ధ్వంసమైన తాత్కాలిక రోడ్డు.. నిలిచిపోయిన వాహన రాకపోకలు - తెలంగాణ తాజా వార్తలు
Published : Sep 22, 2023, 7:18 PM IST
Road Damaged Due To Heavy Rains in Mulugu : రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు పలు జిల్లాలు అతలాకుతలమవుతున్నాయి. రహదారులు జలమయం కావడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ములుగు జిల్లాలో తెల్లవారుజామున కురిసిన భారీ వర్షాలకు వెంకటాపూర్ మండలంలోని బూరుగుపేట గ్రామ సమీపంలో ఉన్న మారేడుగొండ చెరువు నుంచి వరద ఎక్కువ రావడంతో బూరుగుపేట, గుర్రంపేట, పెద్దాపూర్ గ్రామాలతో పాటు భూపాలపల్లి జిల్లాకు రాకపోకలు నిలిచిపోయాయి.
గత జులైలో కురిసిన భారీ వర్షాలకు మారేడుగొండ చెరువు కింద ఉన్న రహదారి.. వరదలకు ధ్వంసం అయింది. అప్పట్లో ప్రభుత్వ అధికారులు స్పందించి ధ్వంసమైన రోడ్డును రూ.13 లక్షలతో తాత్కాలిక మరమ్మతులు చేపట్టి రాకపోకలను పునరుద్ధరించారు. రాత్రి కురిసిన భారీ వర్షానికి మారేడుగొండ చెరువుకు వరద ఎక్కువ కావడంతో తాత్కాలికంగా పోసిన రోడ్డు మళ్లీ ధ్వంసం అయింది. దీంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రోడ్డుపై వరద తీవ్రంగా ప్రవహించడంతో అధికారులు ఇరువైపులా గేట్లను ఏర్పాటు చేశారు.