కేసీఆర్ కుటుంబానికి రాజకీయ భిక్ష పెట్టిందే కాంగ్రెస్ పార్టీ : రేవంత్‌రెడ్డి
Published : Nov 21, 2023, 5:34 PM IST
Revanth Reddy Fires on KCR :ఎన్నికల పోరు ముగింపు దశకు చేరుకోవడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచారాలతో మరింత దూకుడుగా ముందుకు సాగుతోంది. రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా.. అధికార ప్రభుత్వంపై విరుచుకుపడుతూ.. ఆ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయభేరి సభలకు హాజరవుతున్నారు. అందులో భాగంగానే నాగర్ కర్నూల్ జిల్లాలో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని.. సీఎం కేసీఆర్‌పై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పాలనను బొందపెట్టి కాంగ్రెస్ రాజ్యం తీసుకురావాలని ప్రజలను కోరారు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలోనే బీమా, నెట్టెంపాడు, కోయిల్ సాగర్, దేవాదుల వంటి ఎన్నో ప్రాజెక్టులు కట్టి 70 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దే అని పునరుద్ఘాటించారు.
దొరల రాజ్యం కావాలో.. ఇందిరమ్మ రాజ్యం కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలను సూచించారు. భారీ మెజారిటీతో తమ పార్టీ అభ్యర్థిని గెలిపిస్తే.. వట్టెం ప్రాజెక్టును పూర్తి చేసే బాధ్యత తనదని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఇందిరమ్మ రాజ్యంలో ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. తమకు వచ్చిన ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని పాలమూరును పసిడి పంటల పాలమూరుగా మార్చుకుందామని పిలుపునిచ్చారు.