Ministers counter on RevanthReddy Comments : 'రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రుల కౌంటర్.. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలని హితవు'
Ministers counter on RevanthReddy Comments : పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి.. ముఖ్యమంత్రి కేసీఆర్‌పై చేసిన విమర్శల పట్ల బీఆర్ఎస్ ఎదురుదాడికి దిగింది. రేవంత్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రులు(Ministers counter RevanthReddy).. దమ్ముంటే అభివృద్ధిపై చర్చించాలని హితవు పలికారు. లక్షలాది మంది ప్రజలకు పిండాలు, తద్దినాలు పెట్టిన చరిత్ర కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు ఉందని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. అందుకే ఆ పార్టీల నుంచి వచ్చిన రేవంత్‌రెడ్డి.. కేసీఆర్‌కు పిండం పెడతామని మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు రెండుకళ్ల సిద్ధాంతాన్ని సమర్థిస్తూ వచ్చిన రేవంత్‌రెడ్డికి.. అమరవీరుల స్తూపం వద్ద చర్చించే అర్హత లేదని మంత్రి నిరంజన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఓ రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉన్నప్పుడు సంయమనం పాటించాలని. ఏదీ మాట్లాడినా చెల్లుబాటు అవుతుందనుకుంటే అది కుదరదని అన్నారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని మంత్రి సత్యవతి రాఠోడ్ పేర్కొన్నారు. ఇకనైనా ఆయన తన భాష మార్చుకోవాలని హితవుపలికారు. తెలంగాణ వాదినంటూ పదేపదే చెప్పుకుంటున్న రేవంత్.. రాష్ట్రం కోసం చేసిన ఒక గొప్ప పనేమిటో చెప్పగలరా అని ఆమె డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి అహంకారంతో.. కేసీఆర్‌పై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోమని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా వంద సీట్లతో.. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.