GruhaLakshmi Scheme in Telangana : 'గృహలక్ష్మి'కి దరఖాస్తుల కోసం బారులు.. గడువు పెంచాలంటూ విన్నపాలు
GruhaLakshmi Scheme in Telangana : వరంగల్ జిల్లాలోని ఎమ్మార్వో కార్యాలయాల్లో గృహలక్ష్మి పథకం కింద సొంత ఇంటి కోసం దరఖాస్తు చేసుకునేందుకు మహిళలు బారులు తీరారు. ఈ నెల 10 చివరి తేదీ కావడంతో దరఖాస్తులు స్వీకరించేందుకు తహసీల్దార్ కార్యాలయాల్లో ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. గృహలక్ష్మి ద్వారా రూ.3 లక్షల ప్రభుత్వ సాయం పొందేందుకు దరఖాస్తుదారులు పోటీ పడుతున్నారు. ఇంటి నిర్మాణం కోసం కావాల్సిన పత్రాలను వెంట తెచ్చుకొని.. అధికారులకు అర్జీ పెట్టుకుంటున్నారు. దీంతో జిల్లాలోని వర్ధన్నపేట సహా పలు మండల కేంద్రాల్లోని తహసీల్దార్ కార్యాలయాలు జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. తుది గడువు సమీపిస్తుండటంతో మరికొంత కాలం గడువు పెంచాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. కొంత మందికి ఇంకా ఈ పథకం గురించి తెలియదని.. చివరి తేదీని పెంచితే తెలుసుకుని వారు కూడా అప్లై చేసుకుంటారని అర్జీదారులు(Gruhalakshmi Applicants) చెబుతున్నారు. ఇదిలా ఉండగా.. ప్రభుత్వం ఈ దరఖాస్తులను పరిశీలించి.. ఈ నెల 25న లబ్ధిదారులకు ఇళ్లను మంజూరు చేయనుంది.