రామోజీ ఫిలింసిటీలో అయోధ్యరాముని పాదముద్రికలు - భక్తితో దర్శించుకున్న ఉద్యోగులు
Published : Jan 9, 2024, 10:06 PM IST
|Updated : Jan 9, 2024, 10:15 PM IST
Footprints of Ayodhya Ram in Hyderabad : దేశంలో ఇప్పుడు ఎటు చూసినా శ్రీరామ నామం వినిపిస్తోంది. ఈనెల 22న అయోధ్యలో జగదభిరాముని ఆలయ ప్రారంభోత్సవానికి అన్ని ఏర్పాట్లు వైభవంగా సాగుతున్నాయి. ఆ అయోధ్య రాముడి దర్శనం కోసం యావద్భారతం ఎదురుచూస్తోంది. ఆ సీతారాముని కోసం అయోధ్యకు చెందిన ట్రస్ట్ పాదముద్రికలు తయారు చేయించింది. ఆ పాదముద్రికలకు 13 కిలోల బరువు, పంచలోహాలతో తయారు చేశారు. ఈ పాదముద్రికలు తయారు చేసే అదృష్టం హైదరాబాద్ బోయినపల్లికి చెందిన లోహశిల్పి పిట్టంపల్లి రామలింగాచారికి దక్కింది. ఈ నెల 22న అయోధ్యకు చేరుకోనున్న పాదముద్రికలను ఇప్పటికే హైదరాబాద్లోని ప్రజలంతా దర్శించుకుంటున్నారు. అందులో భాగంగా రామోజీ ఫిలిం సిటీకి పాదముద్రికలు చేరుకోగా ఉద్యోగులు, సిబ్బంది దర్శించుకున్నారు.
Ayodhya Ram Padukalu :రామోజీ గ్రూప్ ఉద్యోగులు వీటిని వీక్షించేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. ముందుగా ఫిలింసిటీ ఎండీ విజయేశ్వరి శ్రీరాముని పాదముద్రికలను తలపై మోస్తూ తీసుకొచ్చారు. అనంతరం పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ తర్వాత రామోజీ గ్రూప్ సీనియర్ అధికారులు, ఉద్యోగులు భక్తి శ్రద్ధలతో పాదముద్రికలను దర్శించుకున్నారు. వీటిని తయారు చేసేందుకు 50 రోజులు పట్టిందని రూపకర్త పిట్టంపల్లి రామలింగాచారి తెలిపారు. వీటిని ఈ నెల 22న అయోధ్య రామ మందిరంలో శ్రీరామచంద్రమూర్తి పాదాల వద్ద ఉంచనున్నట్లు వెల్లడించారు.