Pratidwani: వ్యవసాయ గణన... చేరాల్సిన లక్ష్యాలు
Pratidwani: మార్చి నెల నుంచి... రాష్ట్రంలో వ్యవసాయ గణన. రాష్ట్రంలో ఎంతమంది రైతులు ఉన్నారు? కమతాల సంఖ్య.., పరిమాణం ఎంత? పశుసంపద, యాంత్రీకరణంలో రాష్ట్రంలో ఎక్కడ ఉంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూ.. వ్యవసాయ గణన రూపంలో క్షేత్రస్థాయికి వెళ్లనున్నారు విస్తరణ అధికారులు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో సాగుబడి భారీగా పెరిగింది. నీటి వనరులు పెరగడం, ప్రభుత్వ ప్రోత్సాహం, ఎరువల సరఫరా, ఉచిత విద్యుత్, వ్యవసాయ శాఖ సలహాలు, సూచనలతో రాష్ట్రంలో సాగు భూమి లక్షల ఎకరాల్లోకి మారింది. అయితే ప్రభుత్వ మద్దతు, ఇతర సౌకర్యాలు ఎలా ఉన్నా.. రుణాల విషయంలో మాత్రం రైతులకు తిప్పలు తప్పడం లేదు. ప్రభుత్వం ఏడాదికి ఎకరానికి 10వేల రూపాయలు ఇస్తున్నా... అవి ఏమాత్రం సరిపోవడం లేదు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవడం అన్నదాతలకు ఇప్పటికీ అంత సులభం కాదు. ఇప్పటికి రాష్ట్రంలో అక్కడక్కడా అన్నదాతల ఆత్మహత్యల వార్తలు వస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా వాణిజ్య పంటల సాగు చేసిన వారికే ఈ సమస్యలు అధికమవుతున్నాయి. అకాల వర్షాలు, చీడపీడలు, పెరుగుతున్న ఖర్చులకు తోడు.. మార్కెట్లో ఒక్కసారిగా పడిపోతున్న గిట్టుబాటు ధర.. వారిని ఉరితాడుకు దగ్గర చేస్తున్నాయి. ఈ సమస్యలన్నింటిపై వ్యవసాయ శాఖ ప్రత్యేకంగా దృష్టి సారించాల్సి ఉంటుంది. రి... తెలంగాణ వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యల తీర్చడంలో ఈ గణన ఎంతమేరకు ఉపయోగ పడనుంది? రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన సర్వేల ఫలితాలు ఎలా ఉన్నాయి? రైతు నవ్వులే.. బంగారు తెలంగాణ ముఖచిత్రం కావాలంటే అధిగమించాల్సిన సమస్యలు ఏమిటి? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.