కలవరపెడుతోన్న ఇన్‌ఫ్లుయెంజా వైరస్.. వైద్యులు ఏమంటున్నారంటే..?
influenza virus: కరోనా.. ప్రపంచం మొత్తాన్ని ఎంతలా భయపెట్టిందో చూశాం. ఇప్పుడిప్పుడే ఆ పరిస్థితుల నుంచి బయటపడుతున్నాం. అయితే దేశంలో కొత్తగా మరో ఇన్‌ఫ్లుయెంజా వైరస్ వ్యాప్తి కలవరపెడుతోంది. ఈ ఫ్లూ కేసులు విపరీతంగా పెరుగుతుండగా.. మరణాలు కూడా నమోదవడం ఆందోళన కల్గిస్తోంది. ఈ వైరస్ కారణంగా అనేక మంది శ్వాస సంబంధిత సమస్యలతో బాధ పడుతున్నారని.. ఆస్పత్రిలో చేరికలకు కారణమవుతోందని భారత వైద్య మండలి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఇటీవల వెల్లడించింది.
ఇప్పటికే ‘ఇన్‌ఫ్లుయెంజా ఏ ఉపరకం ‘హెచ్3ఎన్2 అనే వైరస్ వలన ఇద్దరు మరణించినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. హరియాణా, కర్ణాటకలో ఒక్కొక్కరు వైరస్ లక్షణాలతో మృతి చెందినట్లు ప్రకటించింది. అంతే కాకుండా శ్వాస సంబంధిత సమస్యలతో అనేక మంది ఆసుపత్రిలో చేరుతున్నట్లు ఐఎంఏ వెల్లడించింది. అసలు కొత్తగా వచ్చిన ఇన్‌ఫ్లుయెంజా వైరస్ లక్షణాలు ఏమిటి? దీనిని కరోనా వైరస్ అంత తీవ్రమైనదిగా పరిగణించాలా? చిన్నారులు, వృద్ధుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు మేలు? వైరల్ ఇన్‌ఫెక్షన్ల వ్యాప్తి నిరోధానికి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? అధికారులు ఏం చెప్తున్నారు? ఇదే అంశంపై ఇవాళ్టి ప్రతిధ్వని.