PRATHIDWANI: అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం రాజ్యాంగబద్ధమేనా ?
PRATHIDWANI: 2022 సెప్టెంబర్‌లో జరిగిన శాసనసభ సమావేశాల్లో ప్రభుత్వం 8 బిల్లులను ప్రవేశపెట్టి.. ఉభయసభల ఆమోదం అనంతరం రాజ్‌భవన్‌కు పంపింది. వాటిల్లో జీఎస్టీ సవరణ బిల్లుకు మాత్రమే ఆమోదముద్ర వేసిన గవర్నర్.. మిగతా 7 బిల్లులను అప్పటి నుంచి పెండింగ్‌లోనే ఉంచారు. దాదాపు 6 నెలలుగా ఈ బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నాయి. రాజ్‌భవన్, ప్రగతిభవన్ మధ్య వివాదం సుప్రీంకోర్టుకు చేరింది. గవర్నర్ బిల్లులు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారని రాష్ట్ర ప్రభుత్వం నిన్న సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
గవర్నర్ మొత్తం 10 బిల్లులు ఆమోదించకుండా పెండింగ్‌లో పెట్టారని పిటిషన్లో పేర్కొంది. సెప్టెంబర్ నెల నుంచి 7 బిల్లులు, గత నెల నుంచి 3 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం తన పిటిషన్లో వివరించింది. అందులో తెలంగాణ విశ్వవిద్యాలయాల ఉమ్మడి నియామక బోర్డు బిల్లు, ములుగులోని అటవీ కళాశాల, పరిశోధనా సంస్థను అటవీ విశ్వవిద్యాలయంగా మార్చే బిల్లు, అజామాబాద్ పారిశ్రామిక ప్రాంత చట్ట సవరణ, పురపాలక నిబంధనల చట్ట సవరణ, పబ్లిక్ ఎంప్లాయిమెంట్ చట్ట సవరణ, ప్రైవేట్ విశ్వవిద్యాలయాల చట్ట సవరణ, మోటర్ వాహనాల పన్ను చట్ట సవరణ, పురపాలక చట్ట సవరణ, పంచాయతీరాజ్ చట్టసవరణ, వ్యవసాయ విశ్వవిద్యాలయ చట్ట సవరణ బిల్లులు ఉన్నాయి. ఆ పిటిషన్లో గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయశాఖలను ప్రతివాదులుగా రాష్ట్ర ప్రభుత్వం చేర్చింది.
పెండింగ్ బిల్లుల విషయంలో తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించడంపై శుక్రవారం గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ట్విటర్ వేదికగా స్పందించారు. రాజ్‌భవన్.. దిల్లీ కంటే దగ్గరగా ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి(సీఎస్)ని ఉద్దేశించి ఈ మేరకు ట్వీట్ చేశారు. సీఎస్‌గా బాధ్యతలు తీసుకున్నాక రాజ్‌భవన్‌కు రావడానికి కూాడా సమయం లేదా అని గవర్నర్ ప్రశ్నించారు. ప్రొటోకాల్ లేదు, అధికారికంగా రాలేదన్నారు. కనీసం మర్యాదపూర్వకంగా కూడా సీఎస్ కలవలేదన్న గవర్నర్.. స్నేహపూర్వక వాతావరణంలో అధికారిక పర్యటనలు ఉపయోగపడతాయని వ్యాఖ్యానించారు.
రాజ్‌భవన్ - ప్రగతిభవన్ మధ్య ఎంతెంత దూరం ? ఈ ప్రశ్న మరోసారి తెరపైకి రావడానికి కారణం... సుప్రీంలో తెలంగాణ ప్రభుత్వం దాఖలు వ్యాజ్యం. అసెంబ్లీ ఆమోదించిన బిల్లుల్ని గవర్నర్ పెండింగ్‌లో పెట్టడం రాజ్యాంగబద్ధమేనా ? వాటికి తక్షణం ఆమోదముద్రవేసేలా గవర్నర్‌కు ఆదేశాలు ఇవ్వాలంటూ కోర్టు తలుపు తట్టింది.. తెలంగాణ సర్కార్. అసలీ వివాదం రోజురోజుకీ ఎందుకింత తీవ్రం అవుతోంది? రాష్ట్ర బడ్జెట్ సమయంలో హైకోర్టు వరకు వెళ్లిన పరిణామాలు.... మళ్లీ ఇప్పుడు సుప్రీం కోర్టు వరకు చేరడానికి కారణాలేమిటి ? పది వరకు కీలక బిల్లులు రాజ్‌భవన్ వద్ద పెండింగ్‌లో ఉండిపోతే.. రాష్ట్రంలో పాలన సాగేది ఎలా? రాజ్యాంగబద్ధమైన వ్యవస్థల మధ్య ఇదంతా ఎంతవరకు వాంఛనీయం ? వివాదానికో ముగింపు ఎలా ? ఇదే అంశంపై నేటి ప్రతిధ్వని.