మోయలేని భారంగా మారిన చదువులు.. ఫీజుల నియంత్రణ ఎప్పటికి ? - ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన ఫీజులు
Prathidwani : విద్యా సంవత్సరం మొదలవుతుందనగానే విద్యార్థుల తల్లిదండ్రుల్లో ఆందోళన కలుగుతోంది. ప్రైవేట్ పాఠశాలలో ఫీజులు గుర్తొస్తేనే భయం వేస్తోంది. ప్రతి ఏటా ఒక పద్ధతి, ఒక విధానం అంటూ లేకుండా 20 నుంచి 50 శాతం పెంచుతున్న పాఠశాలలు ఉంటున్నాయి. కేవలం ఫీజులే కాదు డోనేషన్లు, డెవలప్మెంట్ ఛార్జీలు అని రకరకాల ఫీజుల పేరుతో దోపిడి జరుగుతోంది. రూ. వేలకువేలు ఫీజుల సంగతి ఒక ఎత్తయితే.. యూనిఫాంలు, పుస్తకాలు, బ్యాగుల ఇతరాల పేరుతో అదనంగా వసూలు చేస్తున్నారు.
అయితే ఇవన్నీ కూడా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు భారంగా మారుతున్నాయి. ప్రతి ఏడాది తల్లిదండ్రులు ఆందోళనలు చేస్తున్నారు. చదువులు మోయలేని భారంగా మారాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ అధికారులు నియంత్రణకు చర్యలు చేపడుతున్నామంటున్నారు. అయినా విద్యా సంవత్సరాలు గడుస్తున్నా పరిస్థితిలో ఎలాంటి మార్పు రావట్లేదు. ఎందుకు ఈ సమస్య ప్రతి ఏడాది తలెత్తుతోంది ? దీనిని ఏ విధంగా నియంత్రించాలి ? అనే అంశాలపై నేటి ప్రతిధ్వని.