Drinking Water Festival in Medchal : 'రాష్ట్రానికి కేసీఆర్ అండగా.. మంచి నీళ్ల పండుగ'
Good Water Festival in Telangana 2023 : తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ మంచి నీళ్ల పండగ నిర్వహిస్తున్నారు. మేడ్చల్ మండలం డబిల్‌పూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొన్నారు. నీటి వినియోగంలో భౌతిత్యాన్ని పాటిస్తూ ఒక్క బొట్టు కూడా నీటిని వృథా చేయమని ప్రతిజ్ఞ చేసి దశాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలియజేశారు. నాడు-నేడు నీటి విషయంలో ఎంతో తేడా వచ్చిందని తెలిపారు. అప్పుడు బిందెల్లో నీళ్లు తెచ్చుకునే వారని గుర్తు చేశారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటి గడప దగ్గరకే నీళ్లు వస్తున్నాయని అన్నారు.
ప్రపంచంలోనే ఎత్తయిన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా పేరు తెచ్చుకున్న కాళేశ్వరాన్ని ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరుగుతోందని హర్షం వ్యక్తం చేశారు. తాగు నీరు, సాగు నీరు, 24 గంటల విద్యుత్తు, ఇలా ఎన్నో చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు, ఎంపీపీ, జడ్పీటీసీలు, కౌన్సిలర్లు, నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.