crop damage : అకాల వర్షంతో నేలవాలిన పంట.. పశువుల కోసం వదిలేసిన రైతన్నలు - పంట నష్టాలు
Crops damage in Kagaznagar: అకాల వర్షావ కారణంగా రైతులు నష్టాల బారిన పడ్డారు. వడగండ్ల వానతో పంటంతా నాశనం అయింది. పంట చేతికి వచ్చే తరుణంలో వడగండ్ల వర్షం కారణంగా వరిపైరంతా నేలవాలిపోయింది. ధాన్యమంతా నేల రాలింది. అదే వరద నీటిలో కొట్టుకుపోయింది. అప్పు చేసి పెట్టుబడులుగా పెట్టి సాగు చేసిన రైతులను వర్షాలు నిలువునా ముంచాయి. కనీసం పెట్టబడులు కూడా తిరిగి రాని పరిస్థితి నెలకొంది. నేలరాలిన పైరు చూసి రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
కుమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం మోసం, ఆరేగూడ, గన్నారం గ్రామాల్లోని వేయి ఎకరాల వరిపైరు కూడా నేల వాలింది. ధాన్యమంతా నీటి పాలైంది. ఈ క్రమంలో నేలవాలిన పంటను కోయలేక పశువులకు మేతగా వేస్తున్నారు. ధాన్యమంతా రాలిపోయి మిగిలిన పైరును పశువుల గ్రాసంగా వినియోగిస్తున్నారు. ఆరుగాలం కష్టపడి కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కోతకొచ్చే సమయానికి అకాల వర్షం నాశనం చేసిందని వాపోతున్నారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కోరుతున్నారు.