కోడి కోసం వెళ్లి చిరుత బోనులో చిక్కుకున్న దొంగ - ఉత్తర్‌ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్
ఉత్తర్‌ప్రదేశ్‌లోని బులంద్‌శహర్‌లో వింత ఘటన జరిగింది. బసెందువా గ్రామంలో సంచరిస్తున్న ఓ చిరుతపులిని బంధించేందుకు అధికారులు ఏర్పాటు చేసిన బోనులో ఓ వ్యక్తి చిక్కుకున్నాడు. పులి కోసం ఎరగా బోనులో ఉంచిన కోడిని చోరీ చేసేందుకు యత్నించిన ఆ వ్యక్తికి ఈ దుస్థితి ఎదురైంది. కోడిని దొంగిలించే క్రమంలో డోర్ మూసుకుపోయింది. దీంతో ఆ వ్యక్తి రాత్రంతా బోనులోనే ఉండిపోయాడు. బయటికి రావడం కుదరకపోయేసరికి బోరున విలపించాడు. ఇది గమనించిన స్థానికులు బోనులో చిక్కుకున్న వ్యక్తిని తీసేందుకు యత్నించారు. అయితే అతడిని బయటకు తీసేందుకు వారికి వీలుకాలేదు. దీంతో గ్రామస్థులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. ఇనుప ఊచల డోర్‌ను తెరిచిన అధికారులు.. ఆ వ్యక్తిని బయటకు తీశారు.