Bandi Sanjay Fires on cm Kcr : 'కౌన్సెలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజినీరింగ్ అడ్మిషన్ల దందా చేస్తారా'
Bandi Sanjay Fires on cm Kcr on Gurunanak College Issue : విద్యార్థుల భవిష్యత్ కోసం ఏబీవీపీ పోరాడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో విద్యార్థులు అనేక ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. గురునానక్ కళాశాల విద్యార్థులకు జరిగిన అన్యాయంపై ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ఏబీవీపీ నాయకురాలు ఝాన్సీపై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఆరోపించారు. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఝాన్సీ నివాసంలో ఆమెను పరామర్శించారు. ఈ విషయంపై తీవ్ర స్థాయిలో బండి సంజయ్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ప్రైవేటు వర్శిటీ హోదా రాకుండానే గురునానక్, శ్రీనిధి కాలేజీల్లో 4 వేల మందికి అడ్మిషన్లు ఎలా ఇస్తారని బండి సంజయ్ ప్రశ్నించారు. కౌన్సిలింగ్ ప్రారంభం కాకుండానే ఇంజనీరింగ్ అడ్మిషన్ల దందా చేస్తారా అంటూ మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం డబ్బులకు అమ్ముడుపోయి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తోందని ఆగ్రహాం వ్యక్తం చేశారు. గురునానక్, శ్రీనిధి కాలేజీలు సుమారు నాలుగువేల మంది విద్యార్థుల భవిష్యత్‌ను నాశనం చేస్తున్నాయని ధ్వజమెత్తారు. ఏబీవీపీ సంస్థ గురునానక్, శ్రీనిధి కళాశాలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లేందుకు విజ్ఞాపనపత్రాలు ఇవ్వడానికి వెళితే పోలీసులచే భౌతికదాడులకు చేయించడం దుర్మార్గపు చర్య అంటూ మండిపడ్డారు.