కశ్మీర్లో పర్యాటకుల సాహస యాత్ర.. 5 వేల అడుగుల ఎత్తులో పారా గ్లైడింగ్ - jammu kashmir tourism
భానుడి భగభగలతో రోజురోజుకీ ప్రజలు అల్లాడిపోతున్నారు. వేసవి సెగల నుంచి ఉపశమనం కోసం పర్యాటకులు రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా కొండ ప్రాంతాలకు పరుగులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ, కారకోరం ఎక్స్‌ప్లోరర్స్ అనే ప్రైవేటు సంస్థతో కలిసి నిర్వహిస్తున్న పారాగ్లైడింగ్ సాహసయాత్రపై పర్యాటకులు ఆసక్తి చూపుతున్నారు. దానికి మంచి స్పందన లభిస్తోంది. అక్కడ ఆహ్లాదకర వాతావరణం మధ్య.. ఆకాశంలో పారాగ్లైడింగ్ చేస్తూ సాంత్వన పొందుతున్నారు.
భద్రతా చర్యలు పాటిస్తూ.. 2014లో జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ.. శ్రీనగర్‌లోని అస్తాన్ మార్గ్ శిఖరాగ్రం నుంచి చంద్‌పోరా వరకు పారాగ్లైడింగ్ రైడ్ ప్రారంభించింది. అప్పటి నుంచి సందర్శకులకు, సాహస యాత్రికులకు ఆహ్లాదాన్నిఅందిస్తోంది. పారాగ్లైడింగ్ యాత్ర ప్రారంభమయ్యే అస్తాన్‌మార్గ్ ప్రాంతం 7,400 అడుగుల ఎత్తులో ఉంటుంది.
దీంతో తగిన భద్రతా చర్యలు తీసుకుంటూ పారాగ్లైడింగ్ రైడ్ నిర్వహిస్తోంది జమ్ముకశ్మీర్ పర్యాటక శాఖ. ఓ పర్యవేక్షకుడితో పాటు పర్యాటకులను 12 నుంచి 15 నిమిషాలపాటు 5,330 అడుగుల ఎత్తులో పారాగ్లైడింగ్‌కు అనుమతిస్తోంది. అలా అస్తాన్ మార్గ్ లో ప్రారంభమైన పారాగ్లైడింగ్ చంద్‌పోరాలో ముగుస్తుంది.
స్థానికులతో పాటు సందర్శకులు ఈ సాహసోపేతమైన పారాగ్లైడింగ్ రైడ్‌ను తెగ ఆస్వాదిస్తున్నారు. ఆకాశంలో పక్షిలా విహరిస్తూ దాల్ సరస్సు, మహదేవ్ శిఖరం, దాచిగామ్ పార్క్, మొఘల్ గార్డెన్స్ అందాలను.. పైనుంచి చూడటం మర్చిపోలేని అనుభూతిని ఇస్తోందని పర్యాటకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎత్తైన పర్వతాలు, దాల్ సరస్సు అందాల మధ్య పారాగ్లైడింగ్ రైడ్ సాగటం పర్యాటకుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఈ నెలలో ప్రారంభమైన పారాగ్లైడింగ్ సాహసయాత్ర నవంబర్ చివరి వరకు కొనసాగనుంది.